నచ్చిన అధికారులకు అందలం…నచ్చని అధికారులకు అధ:పాతాళం..ఇదీ జగన్ సర్కార్ లో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ల దుస్థితి. అయ్యా..ఎస్సూ అనే వారికి నెత్తిన పెట్టుకున్న జగన్….అలా కాదు సారూ…అని చెప్పిన వారిని మాత్రం తొక్కేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మొదలైన ఆ జాబితా ఏబీ వెంకటేశ్వరరావు వరకూ కొనసాగింది. అయితే, వారిలో చాలామంది కోర్టులకు, ట్రైబ్యునల్స్ కు వెళ్లి జగన్ పై పై చేయి సాధించారు.
తాజాగా ఆ జాబితాలోకి ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ చేరారు. ఆయనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు తాజాగా కొట్టివేయడంతో జగన్ కు షాక్ తగిలింది. చంద్రబాబు హయాంలో ఏపీఈడీబీ సీఈవోగా పనిచేసిన జాస్తి లబ్ధి పొందారని ఆరోపణలు రాగా…అందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు కేసు కొట్టేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే కృష్ణ కిశోర్ పై కేసు నమోదు చేసినట్లుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
2015లో టీడీపీ ప్రభుత్వం అభ్యర్థన ప్రకారం ఇన్ కమ్ టాక్స్ విభాగం అదనపు కమిషనర్ గా ఉన్న జాస్తి కృష్ణకిశోర్ ను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి కేటాయించారు. ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవోగా ఆయనను చంద్రబాబు సర్కార్ నియమించింది. కానీ, 2019లో జగన్ వచ్చీ రాగానే కృష్ణ కిశోర్ ను విధుల నుంచి తొలగించారు. ఏపీఈడీబీ సీఈవోగా అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది.
అయితే, వెనక్కు తగ్గని కృష్ణ కిశోర్ తన తొలగింపుపై క్యాట్ ను ఆశ్రయించారు. దీంతో, ఆ వ్యవహారంపై విచారణ జరిపిన క్యాట్ ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్రానికి నిర్దేశించింది. దీంతో, కృష్ణకిశోర్ ఢిల్లీలోని ఇన్ కమ్ టాక్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ గ్రేడ్ హోదాతో ఓఎస్డీగా నియమితులయ్యారు. తాజాగా ఆయనపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది.
Comments 1