మెగాస్టార్ చిరంజీవి ని ఆకట్టుకునేందుకు లేదా తమవైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు అదే పనిగా పనిచేస్తున్నాయి.అటు బీజేపీ కానీ ఇటు వైసీపీ కానీ అవే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఆయన ఏ పార్టీని ఎంచుకుని పనిచేసినా, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను స్టార్ క్యాంపైనర్ గా పనిచేయనున్నారు అని తెలుస్తోంది.
నిన్నటి వేళ ప్రధాని నరేంద్ర మోడీ చాలా సేపు చిరుతో మాట్లాడారు. ఆప్యాయతానురాగాలు కురిపించారు. ఇవన్నీ రాజకీయ అవసరాల్లో భాగమే అయినా చిరు ఎటువైపు ఉంటారు అన్నదే ఇప్పుడిక కీలకం.
బీజేపీ వైపు చిరు వెళ్తారా అన్న ప్రశ్న ఎప్పటి నుంచో తొలుస్తోంది. కానీ ఇందుకు సంబంధించి చిరు అంత ఆసక్తిగా లేరు. ఒకవేళ బీజేపీతో పవన్ పొత్తు ఉంటే మాత్రం చిరు అటుగానే ఉంటారని మరో వాదన కూడా ఉంది. కానీ పవన్-తో పొత్తుల విషయమై బీజేపీ ఏమీ తేల్చడం లేదు. ఇదే ఇప్పుడు పెనుచర్చకు తావిస్తోంది.
మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఏపీలో బీజేపీ బలపడేందుకు చిరు లాంటి బలమైన నేత ఒకరు కావాలి. ముఖ్యంగా ఐదు నుంచి ఆరు జిల్లాలలో కాపు ఓటు బ్యాంకింగ్ బలంగా ఉంది కనుక వారిని తమ వైపు తిప్పుకునేందుకు మోడీ ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఉభయ గోదావరి జిల్లాల పెద్దలను తమవైపు తిప్పుకునే కొన్ని పనులు నిన్నటి వేళ బీజేపీ చేసింది.
ఇప్పటికే క్షత్రియులు బీజేపీ వెనుకే ఉన్నారు. ఇదే జిల్లాలో ఎక్కువగా ఉండే కాపులు, శెట్టిబలిజలు కూడా బీజేపీ వెంటే ఉంటే కొన్ని ఆశించిన స్థానాలు బీజేపీ గెలుచుకుని తీరవచ్చు. అందుకే చిరును ఇటుగా రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది సాధ్యం కాకపోవచ్చు.
మరోవైపు వైసీపీ కూడా చిరును ఆకర్షించే పనిలోనే ఉంది. ఇండస్ట్రీ విషయాల్లో చిరు ఎలా చెబితే అలా నడుచుకుంది కూడా ! దీంతో వైసీపీ వైపు ఒకవేళ చిరు వెళ్తే మెగా ఓటు రెండుగా చీలిపోవడం ఖాయం. ఓ విధంగా ఆ పరిణామం పవన్ కు పెద్ద తలనొప్పి.ఇప్పటికే పేర్ని నాని లాంటి వారు చిరును పొగిడి, పవన్ ను తిడుతూ ఉంటారు. అంటే ఏంటి అర్థం ఎలా అయినా మెగా స్టార్ ను తమవైపు తిప్పుకోవాలి అన్న తాపత్రయం వీళ్లలో ఉందనేగా !
కనుక మెగాస్టార్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ వైపు వెళ్లాలా.. వెళ్లాక వాళ్లిచ్చే పదవులు అందుకోవాలా? లేదా వైసీపీ వైపు వెళ్లాలా ? ఇవేవీ కాకుండా తమ్ముడి పార్టీకి బాహాటంగానే మద్దతు ఇచ్చి ఈ ఎన్నికల్లో జనసేనకు సాయం చేయాలా? ఇవే ఇప్పుడు మెగాస్టార్ ముందున్న ప్రశ్నలు.
Comments 1