ఈ రోజు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాల యాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. అనకాపల్లిలోని చోడవరంలో మినీ మహానాడులో పాల్గన్న చంద్రబాబు…జగన్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించడం మాత్రమే చాలదని, జగన్ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపాలని ఆయన టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ ఉన్నంత వరకు యువతకు ఉద్యోగాలు రావని, పెట్టుబడులు రావని చంద్రబాబు ధ్వజమెత్తారు.
టీడీపీ హయాంలో నెలకు లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలిచ్చామని, జగన్ మాత్రం నెలకు రూ.5 వేల జీతం ఇచ్చే వలంటీర్ ఉద్యోగాలిచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కూలీ పని చేసుకునే వారికి కూడా నెలకు రూ.15 వేలు వస్తున్నాయని అన్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల గుంతలు పూడ్చలేని జగన్ 3 రాజధానులు కడతాడా అని చురకలంటించారు. ప్రభుత్వంపై జనాల్లో నానాటికి పెరిగిపోతున్న వ్యతిరేకతను చూసి జగన్కు భయం పట్టుకుందని అన్నారు.
కోడికత్తి నాటకంతో సింపతీ సంపాదించి గత ఎన్నికల్లో జగన్ గెలిచారని చంద్రబాబు ఆరోపించారు. సొంత బాబాయిని చంపి తనపై నేరం వేసి ప్రజల్లో సానుభూతి పొందారంటూ జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని, ఉత్తరాంధ్రలో ఏ2 పెత్తనం చేస్తున్నారని సాయిరెడ్డిపై మండిపడ్డారు. అన్ని వర్గాలను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
సీబీఐపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైసీపీ బెదిరింపులకు సీబీఐ పారిపోయినా టీడీపీ పారిపోదని చెప్పారు. ముఠా నాయకులనే అణచివేసిన పార్టీ టీడీపీ అని, ఎన్ని ప్రాణాలు పోయినా వైసీపీ నేతలను వదిలిపెట్టబోమని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. వైసీపీ హయాంలో పోయే ప్రతి ప్రాణం ఆ పార్టీ నేతల మెడకు ఉరితాడుగా మారుతుందని చెప్పారు. రాష్ట్రంలో తిరుగుబాటుకు సమయం వచ్చిందని, రివర్స్ పాలనకు రివర్స్ ట్రీట్మెంట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని వార్నింగ్ ఇచ్చారు.