ఉత్కంఠగా మారిన రాష్ట్రపతి పదవికి పోటీ పడే వారి పేర్లు ఎప్పటికప్పుడు కొత్తగా బయటకు రావటం తెలిసిందే. రాష్ట్రపతిని ఎన్నికయ్యేందుకు అవసరమైన పూర్తి బలం మోడీ సర్కారుకు లేకపోవటం.. పలువురి మద్దతుతోనే తమ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉండటం తెలిసిందే. దీంతో.. విపక్షాలు ఐకమత్యంతో ఒక్క మాట మీద నిలబడితే.. మోడీ సర్కారుకు ముప్పతిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు బరిలోకి దింపే రాష్ట్రపతి అభ్యర్థిపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
మొన్నటి వరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విపక్షాల అభ్యర్థిగా ప్రచారం సాగటం.. ఆయనే స్వయంగా దాన్ని ఖండించటం తెలిసిందే. దీంతో రేసు నుంచి ఆయన పేరు డిలీట్ అయినట్లే. మరి.. ఇలాంటివేళ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. మోడీ అండ్ కో నిలిపే అభ్యర్థికి ధీటైన అభ్యర్థిని ఎవరిని తెర మీదకు తీసుకొస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటివేళ.. సరికొత్త పేరు ఒకటి తెర మీదకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ మనవడు.. సి. రాజగోపాలాచారి వారసుడైన పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్.. 77 ఏళ్ల గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని ఆయనతో ఫోన్లో చర్చించగా.. తనకు కాస్తంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. 2017లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడి పై పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ అనుభవంతో మరోసారి అలాంటి ఎదురుదెబ్బ తనకు అవసరమా? అన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఆయన కనుక అంగీకరిస్తే విపక్షాలన్ని కలిసి ఆయన్నే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలుపుతాయని చెబుతున్నారు. పవార్ ను బరిలోకి దించాలని పలు పార్టీల అధినేతలు భావించినప్పటికీ.. ఓటమి చెందే యుద్ధంలోకి దిగాల్సిన అవసరం ఏముందన్న వాదనను తెర మీదకు తీసుకు రావటం ద్వారా పవార్ తప్పుకున్నట్లుగా చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో విపక్షాలు బరిలోకి దింపే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ వస్తుందన్న మాట వినిపిస్తోంది.