టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోన్న సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన గురించి, తన సినిమాల గురించి ఇన్ స్టా, ట్విటర్ లో ఎప్పటికపుడు షేర్ చేసే సమంత…సమయం చిక్కితే అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తుంటుంది. సాధారణంగా రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని సమంత…తాజాగా ఓ పొలిటికల్ పోస్ట్ కు లైక్ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఇన్ స్టా గ్రామ్ లో మంత్రి కేటీఆర్ చేసిన ఒక పోస్ట్ కు సామ్ లైక్ కొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ చేసిన పోస్ట్ ను సమంత లైక్ చేయడం చర్చనీయాంశమైంది. ‘దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా మాత్రమే ఉండే తెలంగాణ… దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. (సోర్స్: ఆర్బీఐ రిపోర్ట్ అక్టోబర్ 2021). ఈ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన’ అని కేటీఆర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సమంత ఈ పోస్ట్ కు లైక్ కొట్టింది. దీంతో, బీజేపీకి వ్యతిరేకంగా సమంత లైక్ కొట్టిందా లేదంటే తెలంగాణ డెవలప్ అవుతోందన్న కోణంలో లైక్ కొట్టిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక, మరికొందరైతే తెలంగాణలో ఆర్టీసీ టికెట్ రేట్లను డబుల్ చేశారంటూ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ సమంతను ప్రశ్నిస్తున్నారు. ఇక, జూబిలీ హిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసు ఏమైందంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. సమంత యాంటీ బీజేపీనా? అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.