జేఎస్పీ అనగా జనసేన పార్టీ భవిష్యత్ అంతా బీజేపీ చేతిలో ఉందా ? లేదా బీజేపీ భవిష్యత్ రేఖలు అన్నీ జనసేన శ్రేణులు నిర్ణయిస్తాయా ? రెండు రోజుల పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆంధ్రాలో పర్యటించనున్నారు.
ఇవాళ, రేపు సాగే పర్యటనల్లో పార్టీకి దిశను నిర్దేశం చేయనున్నారు. రేపు రాజమహేంద్ర వరంలో నిర్వహించే గోదావరి గర్జనలో పాల్గొన్ననున్నారు. 40 వేల మందితో ఈ సభను నిర్వహించున్నారు. ఇవాళ కూడా కొన్ని పార్టీ అంతరంగిక సమావేశాల్లో జేపీ నడ్డా విజయవాడ కేంద్రంగా పాల్గొన్నారు. ఇక పొత్తులకు సంబంధించి జేపీ నడ్డా రేపు ఏమయినా మాట్లాడతారా అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది.
ముఖ్యంగా జనసేనకూ, బీజేపీకీ మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీతో జనసేన వెళ్తుందా లేదా అన్నది ఇప్పటికిప్పుడు తేలేలా లేదు. అధినేత చంద్రబాబు కూడా సింగిల్ గా వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనల్లో ఉన్నారు అని కొందరు అంటున్నారు. అది వారి అభిప్రాయమే అయినా పార్టీలో నడుస్తున్న చర్చలకు కూడా ఇదే విషయం ప్రాతిపదికగా నిలుస్తోంది.
పవన్ కూడా బీజేపీతో వెళ్తే బాగుంటుంది అన్న నిర్ణయానికి వచ్చేశారు కానీ ఉమ్మడి సీఎం అభ్యర్థి అనే పదం దగ్గరే, ఆ తరహా ప్రతిపాదన దగ్గరే చర్చలు నిలిచిపోతున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏపీని నడుపుతున్న నాయకులకు, బీజేపీ హై కమాండ్ కు మధ్య మంచి సంబంధాలు లేవు అని కూడా తేలిపోయింది. ఎందుకంటే పార్టీని నడుపుతున్న సోమువీర్రాజు ఎప్పటికప్పుడు అధికార పార్టీకి అనుబంధంగా ఉంటూ పనిచేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో ఆయన్ను తప్పించాలని యోచిస్తున్నారు.
ఏపీ కన్నా తెలంగాణ బీజేపీనే పట్టుమీద ఉంది. అందుకే అక్కడి బీజేపీ నాయకులకే వరుస పదవులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. జీవీఎల్ లాంటి లీడర్లు ఏం మాట్లాడతారో అర్థం చేసుకునేలోపు మరో ప్రకటన మరో నేత నుంచి వచ్చి నెత్తి మీద పడుతుంది. దీంతో ఏపీ బీజేపీకి ప్రక్షాళన అవసరం. అందుకు అనుగుణంగా జేపీ నడ్డా రెండ్రోజుల పర్యటన ఉపయోగపడి, పొత్తుల లెక్క తేల్చి పోతే బాగుంటుంది అన్న భావన ఒకటి పరిశీలకుల నుంచి వినవస్తుంది.