తమ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని ఎరుగని రీతిలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తోందని.. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పదే పదే పొలికేకలు వేసి మరీ చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఏ ప్రబుత్వం కూడా ఇలా `న్యాయం` చేయలేదంటూ.. నొక్కి వక్కాణిస్తారు. ఇది విన్నవారు.. నిజమేనేమో.. అనుకుంటారు.
కానీ, కన్నవారు అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే విషయాన్ని పరిశీలించిన వారు మాత్రం.. `వాస్తవాలు` తెలుసుకుని ఇదేనా.. సామాజిక `న్యాయం` అంటూ… పెదవి విరుస్తున్నారు.
ఇంతకీ ఏం జరుగుతోందంటే.. సామాజిక న్యాయం అంటూ.. సీఎం జగన్ కానీ, ఆయన పార్టీ కీలక నాయకులు కానీ చెబుతున్న మాటల్లో ఎక్కడా వాస్తవం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. కేవలం మంత్రి వర్గంలో మాత్రమే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. అదికూడా అధికారాలు ఇవ్వలేదనే వాదన, వివాదం కూడా ఉన్నాయి.
ఇక, మిగిలిన కార్పొరేషన్లలో కొంత వరకు సామాజిక న్యాయం చేశామని చెప్పుకొన్నా.. అక్కడ కూడా విధులు, నిధులు ఇవ్వకపోవడంతో కార్పొరేషన్లలో ఉన్నవారు.. లబోదిబో మంటున్నారు. రోజుకోరకంగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఇవి కాకుండా.. నామినేటెడ్ పదవులు తీసుకుంటే.. ఆయా సామాజిక వర్గాలకు.. జరిగిన `న్యాయం` కంటే.. అన్యాయమే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. కేవలం తన సామాజిక వర్గం `రెడ్డి` వర్గానికేసీఎం జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం నామినేటెడ్ పదవులు 941 ఉంటే.. వీటిలో 742 పదవులు అంటే.. 76 శాతం రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టారు.
+ యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ పోస్టులు 12 ఉంటే.. 10 రెడ్డి వర్గానికే ఇచ్చారు. అంటే.. 82 శాతం
+ ప్రభుత్వ సలహాదారులు 42 మంది ఉంటే.. వీటిలో 35 పోస్టులను రెడ్డి వర్గానికే కట్టబెట్టారు. అంటే.. 82 శాతం
+ ప్రబుత్వ విప్ పదవులు 6 ఉంటే 4 రెడ్లకే ఇచ్చారు. అంటే 65 శాతం
+ ప్రభుత్వ న్యాయవాదులు మొత్తం 40 మంది ఉంటే.. వీరిలో 30 మందిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ఇచ్చారు. అంటే 75 శాతం.
+ మరి దీనిని బట్టి ఏపీలో వెలిగిపోతున్న సామాజిక న్యాయం ఏంటో.. అధికార పార్టీ పెద్దలే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.