ఆ నలుగురు ఎటు ఉన్నారు ఎటు వెళ్తారు ఎటు వెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడివే ప్రశ్నలు వేధిస్తున్నాయి. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా పేరున్న కరణం బలరాం, వంశీ వల్లభనేని, వాసుపల్లి గణేశ్, మద్దాళి గిరిధర్ దారెటు అన్నది తేలడం లేదు.
ఇంతవరకూ వైసీపీకి అనుగుణంగా కొన్ని కారణాల రీత్యా భయపడి వాయిస్ వినిపించిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ఈ దశలో వీళ్లు అటు వెళ్తారా లేదా వైసీపీతోనే ఉంటూ ప్రయాణిస్తారా అన్నది తేలడం లేదు.
ఇప్పటికే వాసుపల్లి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలకు గుడ్ బై కొట్టేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో కొన్ని భయాలు ఆయన్ను వెన్నాడిన రీత్యా తప్పక ఆయన ఆ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆయన నేరుగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా కొడుకులను పంపి, అధికారికంగానే వైసీపీకి మద్దతు ఇచ్చారు. అయితే టీడీపీ టికెట్ నుంచి గెలిచి వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగి, విశాఖలో స్తబ్దుగానే ఉండిపోయారు. సాయి రెడ్డి హవా కారణంగా ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు కాలేదు.
విశాఖ స్టీల్ ఉద్యమానికి కూడా నేరుగా మద్దతివ్వలేక కొంత ప్రజాగ్రహానికి లోనయ్యారు. ఇదే తరహాలో మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా అటు టీడీపీకి చెందక, ఇటు వైసీపీలోకి నెగ్గుకురాలేక అవస్థలు పడుతున్నారు అన్నది సుస్పష్టం.
ప్రకాశం రాజకీయాల్లో బలంగా ఉండే పేరు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. ఆయన కూడా ఎదురీతే ఈదుతున్నారు. బాలినేని సపోర్టు ఈయనకు ఉన్నా అక్కడున్న లోకల్ పాలిటిక్స్‌లో ఆమంచి కృష్ణమోహన్ ను కాదని ఈయన నెగ్గుకు రావడం కష్టమేనని తెలుస్తోంది. ఆమంచి ని పర్చూరుకు పంపాలని యోచిస్తున్నారు జగన్ అని ప్రధాన మీడియా చెబుతోంది. ఇక్కడ 2019 నుంచి వైసీపీ తరఫున పనిచేస్తున్న ఆమంచిని నియోజకవర్గం మార్పు చేయించి, బాలినేని తన మాట నెగ్గే ఛాన్స్ కోసం చూస్తున్నారు.
అదేవిధంగా గుంటూరు జిల్లా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి కూడా టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వారే ! ఇక్కడ కూడా ఆయనకు స్థానిక నాయకత్వం నుంచే పోటీ వస్తోంది. గత ఎన్నికల నుంచి ఇక్కడ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఏసు రత్నం నుంచి ఆయనకు తలనొప్పులు తప్పేలా లేవు అని తెలుస్తోంది. ఇదే విషయం ప్రధాన మీడియాలో ప్రధానంగా హైలెట్ అయింది కూడా ! అధిష్టానం వైఖరి ఎటు ఉందో తేలకపోవడంతో ఈయనకూ, ఎమ్మెల్యేకూ ఉన్న భేదాలు భగ్గుమంటున్నాయి.