రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండమన్నారు పెద్దలు. అదే తెలుగులో చెప్పాలంటే ఏ ఎండకా గొడుగు పట్టడం…ఇంకా మాస్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దువ్వాలో తెలుసుండడం…అందితే జుట్టు…అందకపోతే కాళ్లు పట్టుకోవడం…ఈ తరహా వ్యవహారాలతో ఎదుటి మనుషులను కనికట్టుతో కట్టిపడేయడం…మాటతీరుతో ఆకట్టుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
కానీ, అది కొందరికి వెన్నతో పెట్టిన విద్య. అటువంటి అతికొద్ది మందిలో ఏపీ సీఎం జగన్ ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రీతిలో…దేశంలోని సీఎంలలో జగన్ తీరు వేరయా అనేందుక అనేక ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. ఒకరిపై భక్తితో..లేదంటే భయంతో ….జగన్ ఏం చేసినా దానికి కొంచెం తిక్క…దానికో లెక్క ఉంటాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది.
ఇక, తనకు వర్తమానంలో పనికి వస్తున్నవారు..లేదంటే తనకు భవిష్యత్తులో పనికి వస్తారేమో అనుకున్న పవర్ ఫుల్ వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడంలో జగన్ ది అందెవేసిన చేయి. ఇదేదో ఫ్లోలో చెబుతోన్న విషయాలు కావు. వాటికి పక్కాగా లెక్కలున్నాయి మరి. సీఎం అయిన వెంటనే ప్రధాని మోడీని తొలిసారి ప్రసన్నం చేసుకున్న జగన్…దాదాపు ఆయనకు సాష్టాంగపడినంత పని చేశారు.
ఏపీలో కింగులా కనిపిస్తోన్న జగనన్న…మోడీ సాబ్ కు మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నారు అన్న విషయం సగటు వైసీపీ కార్యకర్తలకు అప్పుడు అర్థం కాకపోయినా…చాలామంది వైసీపీ నేతలకు ఆ నమస్కారాల వెనకున్న అవసరం ఏమిటో ఈ పాటికి తెలిసే ఉంటుంది. తనపై ఉన్న కేసుల విషయంలో భయంతో జగన్ ఏమైనా చేస్తారన్న టాక్ ఉంది. ఆ భయంతోనే ఏపీకి కేంద్రం తీరని అన్యాయాలు చేస్తున్నా..జగన్ నోరు మెదపడం లేదన్న అపప్రద ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ మోకాళ్లకు మసాజ్ చేయడానికే జగన్ తాజాగా ఢిల్లీలో పర్యటించారని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రధానికి ఎంత మసాజ్ చేసినా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్‌ను ఢిల్లీ పెద్దలు పిలవనేలేదని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లను తాకట్టు పెట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. మోదీ మోకాళ్లకు మసాజ్ చేసి, తనను కేసుల నుంచి బయటపడేయమని జగన్ వేడుకున్నాడని, జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లి సాధించిందేమీ లేదని అన్నారు.
హైకోర్టు చెప్పినా మొండిగా మూడు రాజధానులు అని జగన్ అనడంలో అర్థం లేదని, జగన్ తక్షణమే రాజీనామా చేసి, మూడు రాజధానుల అజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నారాయణ సవాల్ విసిరారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో గౌతమ్‌రెడ్డిపై ఉన్న సానుభూతి కారణంగా రాజకీయపక్షాలు పోటీకి దూరంగా ఉంటే, వైసీపీ నేతలు మాత్రం ఆత్మకూరులో దమ్ముంటే గెలవండని ప్రగల్భాలు పలకడం సరికాదన్నారు. గౌతమ్‌రెడ్డి శవంపై వైసీపీ నేతలు పేలాలు ఏరుకుంటున్నారని మండిపడ్డారు.