తొలగించిన గన్ మెన్లందరినీ మళ్ళీ ప్రముఖులకు కల్పించాలని పంజాబ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది.
424 మంది ప్రముఖులకు వ్యక్తిగత భద్రతను తొలగిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం ఈమధ్యనే నిర్ణయించిన విషయం తెలిసిందే.
అవసరమున్నా లేకపోయినా సమాజంలో హోదాకోసం లేకపోతే వ్యక్తిగత ప్రిస్జేజి కోసం చాలామంది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గన్ మెన్లను ఏర్పాటు చేసుకోవటం అందరికీ తెలిసిందే.
అలాంటి వాటికి ఫులిస్టాప్ పెట్టాలని పంజాబ్ లో కొత్తగా ఏర్పాటైన భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. వ్యక్తిగత భద్రతపై జరిగిన సమీక్షలో 424 మందికి గన్ మెన్లను ఉపసంహరించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. వెంటనే ఆ నిర్ణయం అమల్లోకి కూడా వచ్చేసింది.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే వ్యక్తిగత భద్రతను ఉపసంహరించిన మరుసటిరోజే ప్రముఖ సింగర్ సిద్ధూమూసేవాలాను ఆయన ప్రత్యర్ధులు కాల్చిచంపేశారు. నిజానికి ఇందులో ప్రభుత్వం తప్పేమీలేదు.
ఎందుకంటే సిద్ధూకు ఎప్పటినుండో ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉంది. అందుకనే వ్యక్తిగత భద్రత తో పాటు ప్రభుత్వ గన్ మెన్లు కూడా ఉన్నారు. ప్రభుత్వం గన్ మెన్లను ఉపసంహరించినా ఆయన వ్యక్తిగత భద్రత ఉండాలి.
హత్యకు గురైన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా లేరు. అలాగే ఆయనకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కాదని వేరే కారులో ప్రయాణించారు. దాంతోనే ప్రత్యర్ధుల టార్గెట్ కు దొరికిపోయారు.
ఆయన తన బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణించినా, వ్యక్తిగత భద్రతను వెంట ఉంచుకునున్నా ప్రత్యర్ధులు దాడి చేసేవారు కారేమో.
సరే విషయం ఏదైనా ప్రభుత్వంపై అన్ని వైపుల నుండి బాగా ఒత్తిళ్ళు పెరిగిపోయాయి. దాంతో చేసేది లేక ప్రభుత్వం 424 మందికీ మళ్ళీ గన్ మెన్లను కేటాయించింది. పంజాబ్ లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది.
అధికారికంగా పోలీసులు గుర్తించిందే 85 గ్యాంగులున్నాయి. ఈ గ్యాంగుల్లో కొన్ని వేల మంది కిరాయి హంతకులు పనిచేస్తున్నారు.
ఈ గ్యాంగుల్లో కొన్నింటికి విదేశాల నుండి పెద్దఎత్తున నిధులందుతున్నాయి. వీటన్నింటినీ కంట్రోల్ చేయాలనే ఆప్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది.