రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ మీద బండలేస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీపై వ్యూహకర్త (పీకే) వేసిన బండ మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లయ్యింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీవల్ల తన ట్రాక్ రికార్డు దెబ్బతిన్నదని ఆరోపించటమే. తన ట్రాక్ రికార్డు చెడగొట్టిన కాంగ్రెస్ తో కలిసిపనిచేసేదే లేదని గట్టిగా ప్రకటించారు.
బీహార్లోని వైశాలిలో పీకే జన్ సూరజ్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలతో తాను పనిచేసిన విదానాన్ని తన సక్సెస్ రేటు గురించి గొప్పలు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే పీకే మాటల్లోనే డొల్లతనమంతా బయటపడింది.
మహాకూటమిలో బీహార్లో 2015లో గెలిచారట. 2017లో పంజాబ్ లోను, 2019లో వైసీపీతో ఏపీలో గెలిచారట. 2020లో కేజ్రీవాల్ తో కలిసి ఢిల్లీలో, 2021లో తమిళనాడు, పశ్చిమబెంగాల్లో గెలిచినట్లు చెప్పారు. ఇదే సమయంలో 2017లో యూపీలో కాంగ్రెస్ తో పనిచేసి ఓడిపోయినట్లు చెప్పారు. ఇక్కడే ఆయన డొల్లతనం బయటపడింది.
2017లో పంజాబ్ లో కాంగ్రెస్ గెలవటం ఏమిటి ? ఇదే సమయంలో యూపీలో కాంగ్రెస్ ఓడిపోవటం ఏమిటి ? పీకే వల్ల పంజాబ్ లో కాంగ్రెస్ గెలిస్తే మరి యూపీలో కూడా గెలవాలికదా ? ఇక్కడ విషయం ఏమిటంటే గెలిచే పార్టీలతోనే పీకే జట్టుకడతాడు. పార్టీల్లో దమ్ములేకపోతే పీకే ఏ పార్టీని కూడా గెలిపించలేడు. యూపీలో తన వ్యూహాలు పనిచేయని కారణంగా కాంగ్రెస్ ఓడిపోలేదు. యూపీలో కాంగ్రెస్ అధికారానికి దూరమై దశాబ్దాలవుతోంది.
పంజాబ్, బీహార్, ఏపీ, తమిళనాడులో పీకే గెలిచాడంటే ఆయా రాష్ట్రాల్లోని అధికారపార్టీలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగానే కాంగ్రెస్, వైసీపీ, డీఎంకే గెలిచాయి. బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వంపై జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోవటం వల్లే మళ్ళీ మమతాబెనర్జీయే గెలిచారు. ఇదంతా పీకే తన గొప్పతనంగా చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.
నిజంగానే కాంగ్రెస్ వల్లే తన ట్రాక్ రికార్డు దెబ్బతిన్నదే నిజమైతే మరి సోనియా కుటుంబంతో ఈమధ్యనే ఎందుకని అన్నిసార్లు భేటీఅయ్యారు. పార్టీలో దాదాపు చేరబోయి చివరి నిముషంలోనే కదా తప్పుకున్నది. ఇంతోటిదానికి కాంగ్రెస్ పై బండలేయటం ఏమీ బావోలేదు.