పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. పెరిగిపోతున్న వీఐపీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే వీఐపీల హోదాలో గన్ మెన్ సౌకర్యాన్ని అనుభవిస్తున్న సుమారు 460 మందికి గన్ మెన్లను ఉపసంహరించింది. మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపీలతో పాటు అనేకమంది సీనియర్ నేతలున్నారు. వీళ్ళల్లో అత్యధికులకు నిజానికి ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదమూ లేదు.
గన్ మెన్లను పెట్టుకుని బయట తిరగడానికి చాలామంది ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. కొందరైతే తమకున్న గన్ మెన్ సౌకర్యాన్ని దుర్వినియోగ పరుస్తూ ఇతరుల మీదకు దాడులకు కూడా తెగబడుతున్నారు. దాంతో రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వీఐపీ గన్ మెన్ వ్యవహారాలపై సమీక్షించారు. వాస్తవంగా గన్ మెన్లు ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదనే విషయమై సమీక్షించిన ప్రభుత్వం 460 మందికి గన్ మెన్లు అవసరం లేదని తేల్చింది.
ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో వెంటనే చాలామందికి గన్ మెన్లను ఉపసంహరించేసింది. గన్ మెన్లు విత్ డ్రా అయిన వారిలో ఆదివారం హత్యకు గురైన శుభ్ దీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్దు మూసే వాలా కూడా ఒకడు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో సిద్ధూ వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో సిద్దు కారులోనే కుప్పకూలిపోయారు. మిగిలిన ఇద్దరికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరు ఆసుపత్రిలో ఉన్నారు.
సిద్ధూకి భద్రత ఉపసంహరించిన మరుసటిరోజే హత్యకు గురికావటం వివాదాస్పదమైంది. అవసరం లేని వాళ్ళకు, కేవలం హోదా చిహ్నంగా భావిస్తున్న వారికి గన్ మెన్లను ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో తప్పులేదు. గన్ మెన్లను ఉపసంహరించిన వారిలో భద్రతా పరమైన వార్నింగులున్న వారు ఎవరు ? నిజంగానే భద్రత అవసరమైన వాళ్ళెవరనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు సమీక్షించిన తర్వాతే ప్రభుత్వం గన్ మెన్లను ఉపసంహరించింది. గతంలోనే సిద్ధూ తన పాటలతో బాగా వివాదాస్పదమయ్యాడు. తన పాటల్లో ఎక్కువగా తుపాకీలు, గ్యాంగ్ స్టర్ల లాంటి వాళ్ళని చూపిస్తు హింసను ప్రేరేపించటమే పనిగా పెట్టుకున్నాడు. చివరకు అదే హింసకు బలైపోవటమే విచిత్రం.