ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్ష టీడీపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళలో.. మహానాడును నిర్వహించిన ఆ పార్టీకి ఎన్నో సమస్యలు.. మరెన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు మహానాడుకు వచ్చేందుకు వీలుగా బస్సుల్ని ఏర్పాటు చేయాలంటే ఎదురుదెబ్బలు.
ప్రైవేటు బస్సులకు చేతికి రాకుండా జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఆర్టీసీ బస్సులు డబ్బులు చెల్లిస్తామన్నా బస్సులు ఇవ్వని వైనం. ఇలా ఎన్నో ప్రతికూలతల మధ్య జరిగిన మహానాడు సూపర్ సక్సెస్ కావటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం అంతా ఇంతా కాదన్నట్లు మారింది.
రెండు రోజులు భారీగా నిర్వహించిన మహానాడులో కొందరు కొత్త ఫైర్ బ్రాండ్లు తళుక్కున మెరిసారు. వారందరిలో ప్రముఖంగా ఆకర్షించిన పేరు కావలి గ్రీష్మ ప్రసాద్. ఈ లేడీ సింగం.. వైసీపీ సర్కారు మీద నిప్పులు చెరిగారు. పదునైన విమర్శలతో వైసీపీ సర్కారును ఉతికి ఆరేసిన చందంగా ఆమె మాటలు.. మహానాడుకు హాజరైన వారిని విపరీతంగా ఆకర్షించాయి. కావలి గ్రీష్మ ప్రసాద్ లాంటి యువనేతలు పార్టీకి ఆయుధంగా మారుతుందన్న అభిప్రాయంతో పాటు.. ఇంతకీ ఎవరీమె? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న ఆరా మొదలైంది.
వైసీపీ సర్కారుపై ప్రజల్లో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పే అసంతృప్తికి, కసికి రూపంగా కావటి గ్రీష్మాను అభివర్ణిస్తున్నారు. మైకు పట్టుకొని మాట్లాడిన గ్రీష్మమాటలకు.. మహానాడుకు హాజరైన తెలుగు తమ్ముళ్లు ఈలలు.. కేకలతో ఆమె ప్రసంగానికి జేజేలు పలికారు. అన్నింటికి మించి.. తొడ కొట్టి మరీ వైసీపీకి చేసిన హెచ్చరిక టీడీపీకి కొత్త జోష్ లోకి తీసుకెళ్లింది. ఉద్వేగంగా సాగిన ఆమె స్పీచ్ కు తెలుగు తమ్ముళ్లు ఫిదా అయ్యారు. ఈ సరికొత్త మహిళా ఫైర్ బ్రాండ్ ఎవరన్న ఆరాను గూగులమ్మతో మొదలు పెడితే.. ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
ఇంతకీ కావలి గ్రీష్మ ఎవరో కాదు.. టీడీపీలో సుదీర్ఘకాలం సేవలు అందించిన సీనియర్ నేత.. ఉమ్మడి ఏపీకి తొలి మహిళా స్పీకర్ గా వ్యవహరించిన ప్రతిభా భారతి రాజకీయ వారసురాలే గ్రీష్మ. ప్రతిభా భారతి కుమార్తె అయినప్పటికీ ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తన ఇమేజ్ ను తానే సొంతంగా తెచ్చుకోవాలన్న పట్టుదల గ్రీష్మలో కనిపిస్తుందని చెబుతారు.
2017లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ తరఫున పని చేస్తున్నారు. ఇటీమల ఆమెను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా.. రాజాం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ బాధ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. తాజా మహానాడు కారణంగా ఆమె ప్రతిభ.. ఫైర్ వెలుగు చూసిందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఇప్పటికే చురుగ్గా ఉంటే గ్రీష్మకు రానున్న రోజుల్లో మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.