సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎట్టకేలకు జగన్ సర్కార్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లకు పైగా సస్పెన్షన్లో ఉన్న ఏబీవీ…సుప్రీంకోర్టు తలుపు తట్టి మరీ తాను తప్పు చేయలేదని నిరూపించుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం జీఏడీలో రిపోర్ట్ చేసిన ఏబీవీ ఆ తర్వాత విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏబీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో తన మీద సజ్జల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఏబీవీ…మూడేళ్లుగా ఏం పీక్కున్నారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తానేదో తప్పు చేశానని చెబుతున్న వారు.. ఆ తప్పు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయిందని, సమయం ముగుస్తోందని కూడా సజ్జలనుద్దేశించి వ్యాఖ్యానించారు. జీతాలివ్వకుండా చాలామంది పోలీసులను ఏళ్ల తరబడి వీఆర్లో పెట్టారని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని, కానీ, నేను చేసిన తప్పును నిర్ధారించి శిక్ష అమలు చేయాలని అన్నారు.
75 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని గతంలో కొందరు ప్రయత్నించారని, అటువంటి పోలీసులను తాను వారించానని గుర్తు చేసుకున్నారు. తాను విపక్షానికి వత్తాసు పలుకుతున్నానంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తన సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని, దానిపై చర్చించేందుకు సీఎస్ సమీర్ శర్మను కలవాలనుకున్నానని అన్నారు.
కానీ, తనను కలిసేందుకు సీఎస్ సమీర్ శర్మ విముఖత వ్యక్తం చేయడంతో జీఏడీలో రిపోర్ట్ చేశానని మీడియాకు వెల్లడించారు. రిపోర్ట్ చేయడం తన పని అని, పోస్టింగ్ విషయం ప్రభుత్వ పరిధిలోనిదని అన్నారు. కానీ, తాను ఏం తప్పు చేశానో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. మరి, ఈ నేపథ్యంలో ఏబీవీకి ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందా…ఇస్తే ఎప్పుడిస్తుంది…ఏ పోస్ట్ ఇస్తుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.