వచ్చే ఎన్నికల్లో ఓ మూడు పార్టీలు తెలంగాణ వాకిట అత్యంత కీలకం కానున్నాయి. ఆ మూడు పార్టీలు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాయి. అయితే వాటిని నడిపిస్తున్న జాతీయ శక్తి మాత్రం బీజేపీనే అన్న అనుమానాలు అధికార పక్షం అయిన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరేంటో..? ఎవరెటో చూద్దాం.. ముందుగా ఆ మూడు పార్టీలు ఏవంటే.. ఒకటి వైఎస్సార్టీపీ (అధినేత్రి, షర్మిల), రెండు ప్రజా శాంతి పార్టీ (అధినేత, కేఏ పాల్ ), మూడు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) (ప్రస్తుత తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్) .
ముఖ్యంగా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న షర్మిల గురించే చెప్పుకోవాలి. ఆమె విపరీతంగా పాలకపక్షంపై ఆరోపణలు చేస్తున్నారు.తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్న లక్ష్యంతో ఉన్నారు. పైకి ఈ మాటలు చెప్పినా కూడా ఆమె పార్టీ నాయకులు లోపాయకారీగా బీజేపీతో సత్సంబంధాలు నెరపుతున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ ను వ్యతిరేకించినప్పటికీ ఇదంతా బీజేపీకి సాయం చేసేందుకే అన్న వాదన ఒకటి బలీయంగా వినిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి! అందుకే ఆమె పాదయాత్ర చేసినా లేదా వ్యాఖ్యలు చేసినా అవన్నీ విపక్ష పార్టీ (బీజేపీ) మేలు కోరి చేస్తున్నవే అన్న అభిప్రాయం ఒకటి వస్తోంది.