ఇటీవల సిద్ధిపేటలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై దాడి జరిగిన ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై కేసీఆర్, కేటీఆర్ లే దాడి చేయించారని పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పాల్ కలిశారు. తనపై కేసీఆర్, కేటీఆర్ లే దాడి చేయించారని షాతో పాల్ చెప్పారు.
తెలంగాణ డీజీపీ సమయం అడిగితే ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అడగగానే సమయం ఇచ్చారని పాల్ అన్నారు. అమిత్ షాతో తాను అనేక విషయాలు చర్చించినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని, అదే సమయంలో ప్రధాన మంత్రి మోదీని కలవాలని అమిత్ షా తనకు సూచించారని ఆయన తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలను తన జీవితంలో ఏనాడు చూడలేదని పాల్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ల అవినీతితో రాష్ట్రంలో లక్షల కోట్లు మాయమయ్యాయని ఆరోపించారు.
ఏపీ అప్పులు రూ. 8 లక్షల కోట్లు అని, తెలంగాణ అప్పు రూ. నాలుగున్నర లక్షల కోట్లు అని, ఇలా అయితే దేశం మరో శ్రీలంక అవుతుందని షాకు తెలిపినట్టు పాల్ వెల్లడించారు. తన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని. తనను చంపించేందుకు కేటీఆర్, కేసీఆర్ లు ప్రయత్నిస్తున్నారని ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ బండారం బయటపెడుతున్నందుకే తనపై దాడి చేశారని ఆరోపించారు.
గతంలో తాను కేసీఆర్ కు తాను సపోర్ట్ చేశానని పాల్ చెప్పారు. తాను మద్దతిచ్చినందుకే కేసీఆర్ విజయం సాధించారని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తన కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.