బాలీవుడ్ పై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడి స్టార్లు నటించిన చిత్రాలు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నాయని అన్నారు. అంతేకాదు, ఈ పరిస్థితి మారాలని, ఈ డేంజరస్ ట్రెండ్ నుంచి మనం కూడా బయటపడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మన తెలుగు ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే స్టార్ హీరోలందరూ తమ ఈగోలను పక్కన పెట్టి పని చేయాలని సూచించారు.
ఇండియన్ ఇండస్ట్రీ చాలా మారిందని, గతంలో కుటుంబమంతా థియేటర్ కు వచ్చి సినిమా చూసేందుకు ఇష్టపడేవారని, ఇప్పుడు ఓటీటీలో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని అన్నారు. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా తాను చూశానని, చాలా బాగుందని చెప్పారు. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ లాంటి సినిమాలు నాలుగొస్తే, ప్రేక్షకులు కుటుంబసమేతంగా థియేటర్లకు వచ్చే రోజులు తప్పకుండా తిరిగి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ విడుదల అవుతోందని, అది సూపర్ హిట్ అవ్వాలని.. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అరవింద్ అన్నారు. ఆల్రెడీ బాలీవుడ్ పై మహేష్ బాబు చేసిన కామెంట్లు కాక రేపుతున్న సమయంలో అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తనను బాలీవుడ్ భరించలేదని, తనకు గౌరవం ఉన్న తెలుగు ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తానని మహేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహేష్ కామెంట్లు ఆయన వ్యక్తిగతమని బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్ వంటి వారు అంటున్నారు. మరికొందరేమో నార్త్ ఇండియన్ సినీ ప్రియులు మహేష్ బాబు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, పుష్పతో బన్నీ బాలీవుడ్ మనసునూ, గౌరవాన్ని గెలుచుకున్నాడంటూ సోషల్ మీడియాలో మహేష్, బన్నీ ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్, టాలీవుడ్ పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.