గడిచిన కొద్ది రోజులుగా పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షా పత్రాలు లీకేజీకి సంబంధించి ఏపీలో విమర్శలు.. ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కిన వైనం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారపార్టీ నేతలు విపక్షంపై విరుచుకుపడుతుంటే.. అంతే ధీటుగా విపక్షం అధికార పక్షాన్ని ప్రశ్నిస్తోంది.
ఇలాంటి వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి కమ్ నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ఈ రోజు (మంగళవారం) ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లోని కొండాపూర్ లోని ఆయన నివాసంలో ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే.. నారాయణ ఆరోగ్యం సరిగా లేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆయన్ను అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన జరిగిన ఏపీ పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకు కావటం.. దాని వెనుక నారాయణ.. శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రమేయం ఉందని తిరుపతిలో జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించటం తెలిసిందే.
ఇదిలా ఉంటే సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఏపీ సీఐడీ టీం హైదరాబాద్ కు రావటమే కాదు.. లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కూడా అరెస్టు చేశారని చెబుతున్నారు. అయితే.. నారాయణ కొద్ది రోజులుగా తన ఫోన్ ను స్విచ్ఛాప్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక.. ఈ లీకేజీ విషయంలో నారాయణ విద్యా సంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర ఉందంటున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9.57 గంటలకు ప్రశ్నాపత్రం లీకైంది. ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన తర్వాతే సీఐడీ దూకుడు పెంచింది. మొత్తంగా చూస్తే మాజీ మంత్రి నారాయణ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.