సీఎం జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2గా కొనసాగుతోన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలు, క్విడ్ ప్రోకో కేసుల్లో జగన్ ఏ1 అయితే…విజయసాయి ఏ2 అని…పార్టీలోనూ వీరిద్దరూ ఏ1, ఏ2లుగా కొనసాగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక, పాలనా రాజధాని అంటూ విశాఖను ఎంచుకున్న జగన్…అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భూములు అప్పణంగా దోచుకునేందుకు విజయసాయిని నియమించారని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్దిని క్విడ్‌ప్రోకో జాతిపితగా, సూట్‌కేసు కంపెనీల సృష్టి కర్తగా అయ్యన్న అభివర్ణించారు. వార్డుమెంబర్‌గా కూడా గెలవని నికృష్ణ చరిత్ర ఉన్న విజయసాయిరెడ్డి… పెద్ద పెద్ద సవాళ్లు విసురుతున్నారంటూ ఎద్దేవా చేశారు. `గడ్డం` నెరిసినా సింగిల్-మింగిల్ అంటూ ఆ సరసం పోలేదని చురకలంటించారు.
మీ జాతిరత్నం సింగిల్‌గా సింహంలా వచ్చేవాడైతే ఎందుకీ పరదాలు, వలలు, పర్యటించే ప్రాంతంలో 144 సెక్షన్లు, షాపుల మూసివేతలు అంటూ జగన్, సాయిరెడ్డిల పరువు తీశారు. ఏది ఏమైనా…సాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన కొత్త బిరుదు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, గతంలో విజయసాయిపై టీడీపీ నేత వర్ల రామయ్య కూడా షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. గూగుల్‌లో ఏ2 అని కొడితే విజయసాయి పేరే వస్తుందని,.వేల కోట్ల అవినీతికి పాల్పడటం ఎలా అంటూ సలహాలు ఇచ్చిన నైపుణ్యానికి 16 నెలలపాటు జైల్లో ఉండి వచ్చిన ఘనుడు విజయసాయి అని ఎద్దేవా చేశారు. విశాఖలోని భూదందా చేస్తున్న విజయసాయికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డిల దగ్గర బ్రోకరిజం చేసి పైకి వచ్చిన విజయసాయికి…అంచెలంచెలుగా ఎదిగి 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నిప్పులు చెరిగారు.