టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మోకరిల్లిడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి అలా మోకరిల్లడంపై శెట్టి బలిజలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల అమలాపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశం సందర్భంగా వేణుగోపాలకృష్ణను ఆయన సొంత జిల్లాలోనే శెట్టి బలిజలు ఈ విషయంపై నిలదీసి నిరసన వ్యక్తం చేశారు.
మంత్రి కాన్వాయ్‌ను అడ్డగించిన శెట్టి బలిజ కులస్తులు ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి తమ సామాజిక వర్గానికి చెందిన వేరొకరికి మంత్రి పదవినివ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై వేణుగోపాలకృష్ణ స్పందించారు. దివంగత బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించానని వేణుగోపాలకృష్ణ వివరణనిచ్చారు.
దానికే తాను శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అవమానించానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వెంట కుడిపూడి చిట్టబ్బాయి నడిచి పార్టీ విజయం కోసం కృషి చేసినందుకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించారని, ఈ క్రమంలోనే ఆ కుటుంబాన్ని పార్టీ గౌరవించిందని తెలిపారు. శెట్టిబలిజ వర్గానికి సీఎం జగన్ ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు.
అంతకుముందు, తన పబ్బం గడుపుకోవడానికి శెట్టిబలిజ కులాన్ని మంత్రి వేణు వాడుకున్నారని ఆ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు అలా చేస్తే తప్పులేదని, కానీ, తమ కులం పేరు చెప్పి కాళ్ల మీదపడడం సరికాదని ఆ నేతలు అన్నారు.