సాధారణ ఎన్నికలకు ముందు కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగలటం ఖాయమనే అనిపిస్తోంది. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. సిద్ధరామయ్యను పార్టీలోకి చేర్చుకోవటానికి కమలనాథులు పెద్ద ఆఫర్లే ఇస్తున్నారట. వాళ్ళిచ్చిన ఆఫర్లకు సిద్ధూ కూడా సానుకూలంగానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాదిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
తన వర్గం గా ముద్రపడిన సుమారు 25 మందికి టికెట్లిచ్చేట్లయితే తాను బీజేపీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సిద్ధూ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలకు చెప్పారని సమాచారం. అందుకు బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారట. దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాగైనా బలం పెంచుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కర్ణాటక తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పార్టీకి పెద్దగా ఉనికి కూడా లేదు. ఎప్పుడైనా వస్తే నాలుగు సీట్లు రావటం లేకపోతే అది లేదన్నట్లుగా ఉంది పార్టీ పరిస్ధితి.
అలాంటిది కర్నాటకలో మాత్రమే బీజేపీ ప్రభుత్వంలోకి వస్తోందో మళ్ళీ దిగిపోతోంది. ఇక్కడ ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా అధికారంలోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్, జేడీఎస్ ఎంఎల్ఏలు లాక్కునే అధికారంలోకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో సొంతంగానే అదికారంలోకి రావాలనేది బీజేపీ ప్లాన్. అది సాధ్యం కావాలంటే ఇపుడున్న నేతలతో సాధ్యంకాదు. అందుకనే ఇతర పార్టీ నేతలకు గాలమేస్తోంది.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకు గాలమేసిందని ప్రచారం. పాత మైసూరు ప్రాంతంలో ఎంత ప్రయత్నించినా బీజేపీకి పట్టు దక్కటం లేదు. ఇక్కడ పట్టు లేకపోతే అధికారంలోకి రావటం కష్టమే. ఈ ప్రాంతంలో 89 సీట్లలో బీజేపీ అత్యధికంగా 10 సీట్లు మాత్రమే దక్కించుకుంది. దీన్నిబట్టే కమలం పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతోంది. ఇదే సమయంలో సిద్ధరామయ్యకు ఇక్కడ మంచిపట్టుంది. అందుకనే సిద్ధూపై బీజేపీ కన్నేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే తొందరలోనే సిద్ధరామయ్య బీజేపీలో చేరి పోవడం ఖాయం.