‘ipac’ అధినేత ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించి పరిచయం అక్కర లేదు. 2014లో భారత ప్రధానిగా మోదీని, బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ను గద్దెనెక్కించడంలో పీకేదే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఒక్క యూపీ మాజీ సీఎం అఖిలేష్ మినహా ఇప్పటి వరకు పీకే ఎంతో మందిని సీఎంలను చేశాడు. రాజకీయ వ్యూహకర్తగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పీకే, ఇపుడు మోడీ,నితీశ్ లతో విభేదించి వారిపై వార్ కి దిగాడు.
ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపాడు. అయితే, అది వర్కవుట్ కాకపోవడంతో పీకే సంచలన నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై పీకే తాజాగా స్పందించాడు. తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ పీకే అధికారికంగా ప్రకటించాడు. అయితే, పార్టీ పెట్టబోనన్న పీకే…ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు పీకే సంచలన ప్రకటన చేశాడు. బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడతానని పీకే ప్రకటించారు. సాధ్యమైనంత మంది ప్రజలను తన పాదయాత్రలో కలుస్తానని చెప్పాడు. ఇదో కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం అని పీకే అభివర్ణించారు. రాజకీయ పార్టీ అన్నది ప్రస్తుతానికి తన ప్రణాళికల్లో లేదని అన్నాడు.
తాను జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలని, స్వరాజ్యం అనే ఆలోచనతో రాబోయే మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలన్నదే తన భవిష్యత్ ప్రణాళిక అని పీకే చెప్పాడు. గత 15 ఏళ్లలో బీహార్ కు ఒరిగిందేమీ లేదని, బీహార్ ను మార్చాలనుకునే అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని అన్నాడు. సీఎం నితీష్ కుమార్ తో తనకు ఎటువంటి వ్యక్తిగత ఘర్షణ లేదని, ఇరువురి మధ్య మంచి సంబంధాలున్నాయని చెప్పాడు. వ్యక్తిగత సంబంధాలు వేరని, కలిసి పనిచేయడం వేరని చెప్పాడు. మరి, జగన్ ‘బాట‘లోనే పీకే ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.