ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్ ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని….కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తానని జగన్ ప్రగల్భాలు పలికిన విషయం విదితమే. అయితే, గెలిచిన తర్వాత కేంద్రానికి పూర్తిగా దాసోహం అన్న జగన్….హోదా సంగతి మరచిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఒక్క హోదానే కాదు…విభజన హామీలు మొదలు…తాజా బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడం వరకు….ఏ విషయం పైనా కేంద్రాన్ని జగన్ నిలదీయడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా చారిత్రక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించడంపై ఆంధ్రులు మండిపడుతున్నా….జగన్ మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ పై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.
చారిత్రక కర్మాగారాన్ని అమ్మేయాలనుకుంటున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని, తనను జైల్లో పెడతారన్న భయంతోనే కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. విశాఖలో భూములను కాజేస్తున్న విజయసాయి రెడ్డి…విశాఖ ఉక్కును కాపాడరా? అని ప్రశ్నించారు. విశాఖలో పలువురు షేర్లను బెదిరించి విజయసాయిరెడ్డి కొంటున్నారని, అలాగే విజయసాయి డైరెక్షన్లో జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేయాలనే ఆలోచనలో ఉన్నారా? అని అయ్యన్న సెటైర్లు వేశారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోమంది త్యాగాల ఫలితమని, దానిని కాపాడుకునేందుకు ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 2000 సంవత్సరంలో తన తండ్రి ఎర్రన్నాయుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్లమెంట్ సాక్షిగా అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వరంగ పరిశ్రమగానే స్టీల్ ప్లాంట్ కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు.