ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఎలాగైనా ఎన్నికలు ఆపాలని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2019 ఓటర్ లిస్ట్ ప్రకారం ఎన్నికలు జరుపుతున్నారని, కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్ తీర్పుపై వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఎన్నికల వాయిదాకు నిరాకరిస్తూ ఆ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పందించారు. పంచాయతీ ఎన్నికలు నిలుపుదల ఆఖరి ప్రయత్నం అయిపోయిందని, ఎన్నికల వాయిదాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయానిదే అంతిమ విజయమని అన్నారు.
తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని, తాను బాధ్యతాయుతంగా పనిచేస్తానని నిమ్మగడ్డ తెలిపారు…తనకు ఏ పార్టీ పట్ల వ్యతిరేకత లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. సాధారణ ఏకగ్రీవాలను తప్పుబట్టడం లేదని, కానీ, ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందని నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉంటాయా? అని నిమ్మగడ్డ ప్రశ్నించారు. మార్చి 31న తాను రిటైర్ కాబోతున్నానిని, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికారులు తనకిచ్చే గిఫ్ట్ అని ఆయన అన్నారు. కరోనా కేసులు తగ్గాయని, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికలకు ఇదే సరైన సమయమని వివరించారు. ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని వారికి కల్పించాలని ఆయన కోరారు. గతంలో చిత్తూరులో జరిగిన ఏకగ్రీవాలపై బాగా పరిశోధన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. తన సర్వీసులో ఏ రాజకీయ నాయకుడిని ఒక్క మాట అనలేదని, తప్పు చేస్తే భయపడాలని, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదని అన్నారు.