తాకినదంతా బంగారం కావటం అందరికి సాధ్యం కాదు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు కమ్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు. ఆయనేం వ్యాపారం చేసినా అది సూపర్ సక్సెస్ కావటమే కాదు.. అతి తక్కువ వ్యవధిలోనే ప్రపంచ సంపన్నుడి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
అలాంటి ఆయన కొంతకాలంగా మోజు పడి కొనుక్కున్న ట్విటర్ కారణంగా ఆయనకు అనూహ్య కష్టాలు.. అంతకు మించిన నష్టాలు ఎదురయ్యాయి. ట్విటర్ ను కొనుగోలు చేసిన వార్త అధికారికంగా వెల్లడైన వెంటనే టెస్లా షేర్ విలువ ఏకంగా 12 శాతం పడిపోయింది.
దీంతో.. ఆయన కంపెనీ విలువ ఏకంగా 126 బిలియన్ డార్ల మేర తగ్గిపోయింది. ట్విటర్ ను కొనుగోలు చేసిన ప్రకటనకు ముందు వరకు టెస్లా షేరు మాంచి జోరు మీద ఉంది. ఆయన చేసిన అధికారికప్రకటనతో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. మన రూపాయిల్లో లెక్క చెప్పాలంటే రూ.9లక్షల కోట్లుగా చెబుుతున్నారు. ఇంత భారీగా షేరు విలువ పడిపోవటంతో ఎలాన్ మస్క్ కు ఎప్పుడు ఎదురుకాని కష్టాలు మొదలైనట్లుగా చెబుతున్నారు.
అయినా.. ఒక కొత్త వ్యాపారాన్ని షురూ చేస్తున్నప్పుడు.. సోషల్ మీడియాలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే ట్విటర్ ను సొంతం చేసుకున్నప్పుడు భారీ లాభాలు మూటకట్టుకోవాలే కానీ నష్టాలు ఎందుకు వస్తున్నట్లు? అన్నది ప్రశ్న. దీనికి పలువురు చెబుతున్నకారణాల్ని చూస్తే..
1. ట్విటర్ కొనుగోలు నేపథ్యంలో టెస్లాలో తనకున్న వాటాను పెద్ద ఎత్తున అమ్మకానికి ఎలాన్ మస్క్ పెట్టినట్లుగా ప్రచారం జరగటం
2. ట్విటర్ మీద పెంచుకున్న మోజుతో అవసరమైతే టెస్లాను పణంగా పెడతారన్న వార్త జోరందుకోవటం
3. ఎంచక్కా వ్యాపారం చేసుకోవాల్సింది పోయి.. మీడియాలోకి ఎంట్రీ ఇవ్వటం తెలివి తక్కువ పనిగా భావించటం
4. ట్విటర్ కొనుగోలుతో పలు దేశ రాజకీయాల్లోనూ వేలు పెట్టినట్లు అవుతుందని.. దీంతో టెస్లా వ్యాపారానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయన్న అంచనా
5. అమెరికాలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం
6. ట్విటర్ కొనుగోలు కోసం వెచ్చించే నిధుల్ని ఏ రూపంలో సమకూర్చుకుంటున్నారన్న విషయంపై స్పష్టత ఇవ్వకపోవటం.
కొత్త శక్తిని ఇస్తుందనుకున్న ట్విటర్ పిట్ట.. ఎలాన్ మాస్క్ కు తన ఎంట్రీతోనే కొత్త షాక్ ఇవ్వటంతో.. రానున్న రోజుల్లో మరెన్ని కష్టాలు ఎదురవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ట్విటర్ యజమానిగా ఎలాన్ మాస్క్ కొత్త అనుభవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.