మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. విచిత్రం అనేకన్నా దయనీయం అంటే బాగుంటుందేమో. పద్మకు ఇటు ప్రభుత్వం నుండే కాకుండా పార్టీ నుంచి కూడా మద్దతు కరువైనట్లే అనుమానంగా ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక స్థితి సరిగా లేని యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలిన పరామర్శించేందుకు పద్మ ఆసుపత్రికి వెళ్ళారు. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి చంద్రబాబునాయుడు కూడా అక్కడకు చేరుకున్నారు.
ఈ నేపధ్యంలోనే ఇటు పద్మ అటు చంద్రబాబు అండ్ కో మధ్య గొడవైంది. గొడవ తర్వాత కమీషన్ నుంచి చంద్రబాబు, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమకు నోటీసులు వెళ్ళాయి. దాంతో గొడవ మరో కోణంలోకి మారిపోయింది. వెంటనే చంద్రబాబుకు మద్దతుగా పార్టీ నేతలు+మహిళా విభాగం రంగంలోకి దిగేశాయి. పద్మపై బోండా, మహిళాధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
సరే ప్రతిపక్షం అన్నాక అలాగే మాట్లాడుతుంది అని సరిపెట్టుకుందాం. మరి పద్మకు, మహిళా కమీషన్ కు మద్దతుగా మంత్రులు, వైసీపీలోని నేతలు, ప్రత్యేకించి మహిళా ప్రజాప్రతినిధులు, నేతలు ఎందుకని నోరిప్పటం లేదు. ఆసుప్రతిలో చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ కనీసం మహిళా మంత్రులు కూడా నోరిప్పలేదు. మహిళా మంత్రుల్లో రోజా, రజనీ, ఉషశ్రీ చరణ్, తానేటి వనితలుండి ఉపయోగం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
మిగిలిన ఇద్దరినీ మినహాయిస్తే రోజా, రజనీ రెగ్యులర్ గా మీడియాలో కనబడుతూనే ఉన్నారు. అయినా పద్మ, మహిళా కమీషన్ కు మద్దతుగా పెద్దగా మాట్లాడలేదు. అంటే పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుండి కానీ పద్మకు పెద్దగా మద్దతు దొరకలేదన్న విషయం అర్ధమైపోతోంది. పార్టీలో ఈ విషయమై చర్చ కూడా మొదలైంది. విచిత్రం ఏమంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయమై దృష్టిపెట్టినట్లు లేరు. పద్మకు మంచి వాగ్ధాటి ఉంది కాబట్టి ఆమొక్కతే ఒంటరిపోరాటం చేసున్నారు. ఏదేమైనా ఈ ఘటనతో ప్రభుత్వం, పార్టీలోని డొల్లతనం బయటపడింది.