మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కార్ పై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్ లో హిందుత్వ భావజాలాన్ని రగిల్చేందుకు ఆయన తమతో కలిసి హనుమాన్ చాలిసా చదవాలంటూ ఎంపీ నవనీత్ కౌర్, రవి రాణాలు పిలుపునివ్వడం వివాదానికి తెర తీసింది. ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలిసా పఠించాలని అనుకున్న ఆ ఇద్దరు…శాంతిభద్రతల కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.
అయినప్పటికీ ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా…కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలనే వారు తమపై ఎఫ్ఐఆర్ కొట్టాయలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్నది తన అభిమతం కాదని నవనీత్ తెలిపారు.
ఉద్రిక్తతలు చెలరేగే అవకాశముండడంతో తాము సీఎం నివాసానికి వెళ్లడంలేదని స్పష్టం చేసి, తాను, తన భర్త రవి రాణా ఇంటికే పరిమితమయ్యామని చెప్పారు. అయినా సరే, 23వ తేదీన తామిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని, తాగేందుకు నీళ్లు ఇవ్వాలని ఎన్నో పర్యాయాలు విజ్ఞప్తి చేసినా పోలీసులు ఒక్కసారి కూడా స్పందించలేదని ఆరోపించారు. తాము షెడ్యూల్డ్ కులానికి చెందినందున అదే గ్లాసుతో తమకు నీళ్లు ఇవ్వబోమని చెప్పారని ఆరోపించారు.
తనను కులం పేరుతో నేరుగానే దూషించారని, కులం కారణంగానే మంచినీళ్లు ఇవ్వలేదన్న విషయం స్పష్టమైందని అన్నారు. బాత్రూంను వినియోగించుకోవాలని భావించినప్పుడు కూడా నిమ్న కులాల వారు తమ బాత్రూంలు వినియోగించుకోవడాన్ని మేం అంగీకరించబోమని పోలీసులు చెప్పారని ఆ లేఖలో నవనీత్ వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.