ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఉన్న 22మంది ఎంపీల్లో `ఆయన చాలా హాట్ గురూ` అనే మాట గుంటూరుకు చెందిన ఒక ఎంపీ విషయంలో జోరుగా వినిపిస్తోంది. “మా ఎంపీ గారి గురించి ఏం చెప్పమంటారు..? ఆయన ప్రజలకు మాత్రమే దూరం.. వివాదాలకు.. సెటిల్మెంట్లకు చాలాదగ్గర. అదేమంటే.. తన చేతిలో అధిష్టానం ఉందని అంటారు. అధిష్టానం.. మాత్రం ఆయనను ఇంకా.. లాలిస్తూనే ఉంది. మూడేళ్ల అయింది.. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ.. తాగు నీరు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు సాధించింది.. చేసింది ఏమీలేదు“ ఇదీ.. సదరు నియోజకవర్గం ప్రజలు చెబుతున్న మాట.
వాస్తవానికి వైసీపీలో ఉన్న 22 మంది ఎంపీల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర పోగు పడింది. ఇప్పటికి మూడేళ్ల యింది.. ఎవరూ ఒక్కరూ కూడా మా నియోజకవర్గం అభివృద్ధి చేశాం.. అనిచెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు ఎంపీలు నియోజకవర్గాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొందరు వ్యాపారాలు వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ తీరిక లేకుండా ఉన్నారు. మరికొందరు.. తమకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి.. వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు.
ఈ క్రమంలో ఓ యువ ఎంపీ వ్యవహారం పార్టీలో మరింత రచ్చకు దారితీస్తోందనే వాదన ఇటీవల జోరుగా వినిపిస్తోంది. ఈ ఎంపీ స్టయిలే వేరని అంటున్నారు. ఈయనకు ప్రజల కన్నా.. వివాదాలు.. మిన్న అనే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. చిన్న చిన్న వివాదాలు.. చిన్నపాటి సెటిల్మెంట్లు అంటే.. ఈయనకు చాలా ఇష్టమట. దీనివల్ల.. పార్టీ కేడర్లో తనకు ఎనలేని గుర్తింపు వస్తుందని కూడా చెప్పుకొం టున్నారు.
ఆయనే.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన ఎంపీగా ఎన్నికయ్యాక.. ఇది నేను చేశాను.. అని చెప్పుకొ న్న కార్యక్రమం కానీ.. ఇది నేనే తెచ్చాను.. అని చెప్పుకొనే ప్రాజెక్టు కానీ లేవని అంటున్నారు. అంతెం దుకు.. బాపట్లలో సగం ప్రాంతాలకు తాగు నీటి సమస్య ఉంది. ఇక్కడ రైతులకు సాగు నీటి సమస్య ఉంది. ఇక్కడ యువత ఉపాధి కోసం వేరే వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు. ఆయా సమస్యలు పరిష్కరిస్తానని.. నేను కూడా ఇబ్బందులు పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు గత ఎన్నికల సమయంలో.
అయితే.. ఈ మూడేళ్లలో ఆయనకు ఇవేవీ కనిపించలేదు. కానీ, చిన్న చిన్న వివాదాలు.. సైకిల్ కేసుల సెటిల్మెంట్లు.. ట్రాఫిక్ పోలీసులు రాసే చలానా వివాదాలు పరిష్కరించడం తప్ప.. ఇతమిత్థంగా ఆయన చేసిన పని అంటూ ఏమీలేదని.. నియోజకవర్గం గగ్గోలు పెడుతోంంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఆయనకు ఒక్కరితోనూ సఖ్యత లేదు. అందరితోనూ వివాదాలే. ఇవి కూడా చిన్న చిన్న వివాదాలే అయినా.. సార్ ఎంపీనని.. అధిష్టానం దగ్గర తనకు పెద్ద పలుకుబడి ఉందని చెప్పుకొంటారు. కానీ, ఎక్కడా సమస్యలు పరిష్కరించింది లేదు.
అంతేకాదు.. చిల్లర సెటిల్మెంట్లు చేసేందుకు 24/7 పనిచేస్తున్న ఎంపీ.. ప్రజలకు మాత్రం అందుబాటు లో లేకుండా పోతున్నారని అంటున్నారు. ఇదీ.. ప్రస్తుతం యువ ఎంపీ.. సీఎం జగన్కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్న నాయకుడి గురించి.. నియోజకవర్గం ప్రజలు చెబుతున్న మాట. కేవలం ఎస్సీ.. ట్యాగ్ తో పనికానిచ్చుకోవడం.. ఈయనకు తెలిసిన రాజకీయ విద్యగా చెబుతున్నారు. కనీసం.. తన సామాజిక వర్గానికి కూడా ఎలాంటి మేళ్లు చేయలేక పోవడం గమనార్హం. మరి వచ్చే ఎన్నికల్లోనూ ఈయనకే టికెట్ ఇస్తారో.. ఏమో.. చూడాలి.