ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ కాలం ముగిసినందున తనకు రూల్స్ ప్రకారం పూర్తి జీతం తక్షణమే చెల్లించాలని, డీజీపీ హోదాలో ఉన్న తన సస్పెన్షన్లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏబీ తేల్చి చెప్పారు. రెండేళ్లు పూర్తయినందున తన సస్పెన్షన్ తొలగిపోయినట్లేనని లేఖలో పేర్కొన్నారు.
తనపై సస్పెన్షన్ను ఆరేసి నెలల చొప్పున ఏపీ సర్కార్ పొడిగిస్తూ వచ్చిందని, ఆ లెక్కన మొత్తం రెండేళ్ల సస్పెన్షన్ గడువు జనవరి 27కే ముగిసిందని చెప్పారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించాలంటే కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి అని, ఈ కారణంతో తనపై సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇక కొనసాగించలేదని వెల్లడించారు. గడువు ముగిసినందున రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్గా తొలగిపోయినట్టేనని అన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ సస్పెన్షన్ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై దేశపు సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎంత కాలం కొనసాగిస్తారని ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనను పరిశీలించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.
ఈ విషయంలో దిశా నిర్దేశం చేయవలసింది కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరామని సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. సస్పెన్షన్ విధించి రెండేళ్లు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారా? అంటూ జగన్ సర్కార్ పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని సుప్రీం ఆదేశించింది. అంతేకాదు, ఆ తర్వాత విచారణను వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో, ఏబీవీ విషయంలో జగన్ సర్కార్ ఇరుకునపడ్డట్లయింది. మరి, ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.