ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేశ్ ను పనిగట్టుకొని విమర్శించే వారి సంఖ్య పెరిగిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి చెందిన పేటీఎం బ్యాచ్…కావాలనే చంద్రబాబుపై ట్రోలింగ్ చేయడం, పనికిమాలిన విమర్శలు గుప్పించడం వంటివి చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అటువంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై చెత్తవాగుడు వాగేవారి కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని బుద్ధా వెంకన్న షాకింగ్ కామెంట్లు చేశారు. ఎవరైనా అనవసరంగా తమ పార్టీ అధినేత చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా సూసైడ్ బ్యాచ్ రెడీ అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రెండేళ్ల పాటు చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడులు చేస్తే పదవులు వస్తాయని వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ప్రతి మనిషిలో కృతజ్ఞత అనేది ఉండాలని, పార్టీలో తనకు, నాగుల్ మీరాకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన కటౌట్‌కు పంచామృతాలతో పాలాభిషేకం చేశామని, 500 మందికి చీరలు పంపిణీ చేశామని అన్నారు.
జగన్ అండ చూసుకొని వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నేత నాగుల్ మీరా ఫైర్ అయ్యారు. జగన్ వైఫల్యాలను చూసి ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబు పాలన మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ముందు చూపు వల్లే ఉమ్మడి ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందని, ఒక్క చాన్స్ అని అడిగినందుకు జనం ఓట్లేస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని నాగుల్ మీరా చెప్పారు.