తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర 2.0 ఇప్పుడు సాగుతోంది. మొదటి దఫా చేసిన పాదయాత్రతో పోలిస్తే.. రెండో దశలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాదయాత్రను అడ్డుకోవటం లాంటివి తెర మీదకు వస్తున్నాయి. దీంతో.. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. టీఆర్ఎస్ సర్కారు తీరు మీదా.. సీఎం కేసీఆర్ నిర్ణయాల మీద ఘాటు విమర్శల్ని సంధిస్తున్నారు బండి సంజయ్. అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారిన ఈ పాదయాత్రను పలువురు టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. అయితే.. బండి పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బండి పాదయాత్రను బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో పాగా వేయాలని తపిస్తున్న ఆ పార్టీ.. అందుకు తగ్గట్లే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవటం.. అందుకు తగ్గట్లుగా అడుగులు వేయటం కనిపిస్తోంది. బండి పాదయాత్రకు బలం చేకూరేందుకు సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది బీజేపీ అధినాయకత్వం. పాదయాత్ర మొదలైన నాటి నుంచి ఏదోలా చికాకులు ఎదురవుతున్న నేపథ్యంలో తనకున్న అధికారాన్ని చూపించేలా వ్యూహాన్ని సిద్ధం చేసింది. పలువురు కేంద్రమంత్రులను పాదయాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
బుధవారం (ఏప్రిల్ 20న) కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాదయాత్రకు హాజరు కానున్నారు. నారాయణపేటలో నిర్వహించే సభకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ మురుగన్ హాజరు కానున్నారు. గద్వాలలో గురువారం నిర్వహించే బహిరంగ సభకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఇక.. నాగర్ కర్నూలు సభకు కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వస్తారని చెబుతున్నారు. ఇలా.. బండి పాదయాత్ర జరిగినన్ని రోజులు ఎవరో ఒకరు హాజరయ్యేలా చూసుకోవటం కనిపిస్తోంది. పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిధిగా పాల్గొనటం చూస్తే.. పాదయాత్రలకు బీజేపీ అధినాయకత్వం ఎంత ప్రయారిటీ ఇస్తుందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.