టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల కలగానే మిగలనుందా? ఆయన వరి రాజకీయం ప్రెస్ మీట్లో నిన్న కూడా జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు లేని ప్రత్యామ్నాయ ఫ్రంట్ గురించి సూచనలు చేశారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ నిజంగా సాధ్యమేనా? అన్నది అందరికీ అనుమానమే. ఎందుకంటే ఇది చాలా సార్లు ఫెయిల్ అయ్యింది.
దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన శరద్ పవార్ ‘థర్డ్ ఫ్రంట్’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ముంబైలో మాట్లాడుతూ, కాంగ్రెస్ లేకుండా ‘థర్డ్ ఫ్రంట్’ సాధ్యం కాదని అన్నారు. బీజేపీతో పోరాడాలంటే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి కానీ కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్‌ను ఊహించలేనని పవార్ అన్నారు.
ఫిబ్రవరిలో కేసీఆర్ పవార్‌తో సమావేశమై ‘థర్డ్ ఫ్రంట్’పై చర్చలు జరిపారు. ఈ భేటీపై పవార్ నోరు మెదపకపోయినప్పటికీ, చర్చలు ఫలవంతమయ్యాయని కేసీఆర్ నమ్మకంగా మీడియాకు చెప్పారు.
ఇపుడు పవారే స్వయంగా కాంగ్రెస్ తోనే మూడో ఫ్రంట్ అంటున్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఏమవుతుంది? మమత ఏమంటుంది? మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అన్నది చూడాలి.