దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటి. రాష్ట్ర విభజన అంశంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ కమ్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ఇష్యూలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను ప్రస్తావించటమే కాదు.. వాటినేమీ పట్టించుకోకుండానే విభజన జరిగిందన్నది ఉండవల్లి వాదన. అయితే.. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టుకు చేరిందే తప్పించి.. ఇప్పటివరకు విచారణకు చోటు చేసుకున్నది లేదు.
ఏమాటకు ఆ మాటే చెప్పాలి. విభజన సందర్భంగా అనుసరించాల్సిన నిబంధనల్ని పాటించలేదన్న విషయంపై ఒక్క ఉండవల్లి తప్పించి మరెవరూ మాట్లాడింది లేదనే చెప్పాలి. ఆయన ఒక్కరు.. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ.. ప్రతి వేదిక మీదా ఆయన తన వాదనల్ని వినిపించేవారు. విభజన సందర్భంగా ఎలాంటి నిబంధనల్ని పాటించలేదని.. చాలా అన్యాయంగా విభజన చేశారన్నది ఆయన వాదన.
ఏపీ పునర్విభజన సమయంలో తప్పు జరిగాయని.. విభజన ప్రక్రియ సరిగా జరగలేదని చెబుతున్న ఆయన పిటిషన్ విచారణకు రాని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఆయనో సవరణ పిటిషన్ వేశారు. అందులో తన పిటిషన్ అబ్జెక్టివ్ ను స్పష్టంగా పేర్కొంటూ..విభజన ప్రక్రియలో జరగాల్సిన తప్పులేవో జరిగిపోయాయని.. కనీసం భవిష్యత్తులో జరగాల్సిన వాటి విషయంలో అయినా పద్దతుల్ని.. విధానాల్ని పక్కాగా పాటించాలన్నదే తన ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. పిటిషన్ దాఖలు చేసి చాలాకాలమైందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. పిటిషన్ పై విచారణను చేపట్టాలని కోరారు ప్రశాంత్ భూషణ్.
దీనికి సానుకూలంగా స్పందించిన సీజేఐ.. ఉండవల్లి పిటిషన్ ను వచ్చే వారం లిస్టు అయ్యేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించారు. దీంతో.. ఏళ్లకు ఏళ్లుగా ఉండవల్లి పోరాడుతున్న పోరాటం ఒక దశకు చేరిందని చెప్పాలి. మరి.. ఈ పిటిషన్ విచారణ విషయంలో ఏమేం అంశాలు తెర మీదకు వస్తాయో చూడాలి.