జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేసిన జగన్…హైకోర్టు చెప్పిన డెడ్ లైన్ లోపు వాటిని పూర్తి చేయడం చేతకాదంటూ చేతులెత్తేశారు. అమరావతిపై కక్ష సాధిస్తోన్న జగన్..గతంలో పదో తరగతి తెలుగు పాఠ్యాంశాల నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది.
2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా…అందులో, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ని చేర్చారు. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ కూడా వివరించారు. అయితే, జగన్ వచ్చిన తర్వాత ముద్రించిన కొత్త పుస్తకాల్లో అమరావతి పాఠాన్ని పాఠశాల విద్యాశాఖ తొలగించడం వివాదానికి కేంద్ర బిందువైంది. జగన్ హయాంలో 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను సేకరించి కొత్త పుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచించడం కూడా వివాదానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అమరావతిపై జగన్ అక్కసు వెళ్లగక్కారు. పదో తరగతి తెలుగు పుస్తకం నుంచి ‘అమరావతి’ సిలబస్‌ను తొలగించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందును విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. దాంతోపాటు వివిధ సబ్జెక్టుల్లోని మరికొన్ని పాఠాలను కూడా తొలగించామని వారు అంటున్నారు.
అయితే, తెలుగులో అన్ని పాఠాలుండగా కేవలం అమరావతి సిలబస్‌ను తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులపై భారం పడకూడదన్న ఆలోచన ఉన్నవారు చివర్లో ఉన్న పాఠాలను తొలగిస్తారు. కానీ సిలబస్ ప్రకారం రెండో పాఠంగా ఉన్న అమరావతిని ఎలా తొలగిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు తప్ప మిగిలిన పాఠాలు చదువుకుని సిద్ధం కావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. అయతే, ఆల్రెడీ రెండోపాఠం అమరావతిని విద్యార్థులు ఎప్పుడో చదివేసి ఉంటారు. చివరి పాఠాలు చివరన చదువుతారు. కాబట్టి, ఇపుడు నిజంగా వారిపై అదనపు భారం పడుతంది. మరి, ఈ పాయింట్ ను జగన్ ఎలా మరచిపోయారో?