దేశంలోని దర్యాప్తు సంస్థలు, పోలీసు వ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు’ అనే అంశంపై ప్రసంగించిన సీజేఐ ఎన్వీ రమణ..పోలీసు వ్యవస్థను ఆధునికీకరించాల్సిన అత్యావశ్యకతను వివరించారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారని, కానీ, దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని ఎన్వీ రమణ అన్నారు.
స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం అని, ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీజేఐ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. దాంతోపాటు, అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఏటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలని సూచించారు.
శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, చాలావరకు నేర విచారణ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విశ్వసనీయతలో జాతీయ సంస్థల కంటే పోలీసులు వెనుకబడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అవసరమని, ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశగా కృషి చేయాలని ఆయా సంస్తలకు జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఆ సంబంధాల మెరుగు కోసం పోలీసు శిక్షణ విధానంలో సమూల మార్పులు రావాలని సూచించారు.