సాయం చేసి బయటకు చెప్పుకోకపోవటం కొందరికి అలవాటు. అలాంటి పనులెన్నో చేసిన వ్యక్తికే సాయం చేయటం.. అది కూడా ప్రాణాన్ని ఇవ్వటానికి మించింది ఏముంటుంది? సినీ నటుడిగా సుపరిచితుడు మెగా ఫ్యామిలీలో హుషారైన కుర్రాడి మాదిరిగా చెప్పే సాయి ధరమ్ తేజ్ వ్యక్తిత్వం అతడికో ప్లస్ పాయింట్ గా చెబుతుంటారు.
ఎవరైనా ఆపదలో ఉన్నారన్నా.. సాయం కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసినంతనే వెనుకా ముందు చూసుకోకుండా సాయం చేసే కొద్ది మంది టాలీవుడ్ హీరోల్లో తేజ్ ఒకడిగా చెబుతారు.
ఆ మధ్యన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోయినంతవరకు వెళ్లి.. క్షేమంగా తిరిగి వచ్చిన ఆయన తాజాగా ఒక వీడియోను చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ చేసిన తొలి వీడియోలో.. తనకు ప్రాణదానం చేసిన వ్యక్తిని ప్రత్యేకంగా తలుచుకోవటమే కాదు.. తానీ రోజున ఇలా ఉన్నానంటే కారణమైన ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా తలుస్తూ వీడియోను రూపొందించారు.
ప్రమాదం జరిగిన వెంటనే.. తీవ్రతను గుర్తించి తనను ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు నిలిపిన సయ్యద్ అబ్దుల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్న సాయిధరమ్ తేజ్.. మానవత్వం మిగిలి ఉందని చెప్పటానికి సయ్యద్ ఒక ఉదాహరణగా అభివర్ణించారు. తనకు మెరుగైన వైద్యాన్ని అందించిన వైద్యులకు.. ఆసుపత్రికి తాను రుణపడి ఉంటానని చెప్పారు.
తన కొత్త సినిమా ఈ నెల 28న ప్రారంభం అవుతుందని.. తన కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన సుకుమార్.. బీవీఎస్ఎన్ ప్రసాద్ లకు థ్యాంక్స్ చెప్పిన ఆయన.. హెల్మెట్ పెట్టుకోవటం వల్లే తాను బతికానని.. టూ వీలర్ మీద వెళ్లే ప్రతి ఒక్కరూ దాన్ని తప్పనిసరిగా ధరించాలని కోరారు.
మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కల్యాణ్ తో సహా సినిమా ఇండస్ట్రీ పెద్దలకు.. ప్రముఖులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్ చేసిన సూచనల్లో అత్యంత కీలకమైనది.. ప్రతి ఒక్కరు పక్కాగా ఫాలో కావాల్సిన అంశం ఒకటి ఉంది. టూ వీలర్ మీద పక్క వీధిలోకి వెళుతున్నా సరే.. తలకు మాత్రం హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నిజమే.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు పక్కాగా ఫాలో కావాల్సిందే.