విశాఖలో దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటు విషయంపై కేంద్రం తీరును టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గత రెండున్నరేళ్లుగా ఎండగడుతోన్న సంగతి తెలిసిందే. ఈ రైల్వేజోన్ విషయంలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, 2019లో ఇచ్చిన హామీపై పురోగతిలేదని లోక్‌సభలో పలుమార్లు గళమెత్తారు. మందలాగా ఉన్న వైసీపీ ఎంపీలు సభలో మాట్లాడకపోయినా…రామ్మోహన్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి కేంద్రం తీరును ఎండగట్టారు.
మూడేళ్లు గడుస్తున్నా కేంద్రం ఏ మాత్రం చొరవచూపడంలేదని, 2021-22 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించడంపై గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా దుయ్యబట్టారు. ఆ డబ్బుతో కనీసం రైల్వే జోన్ భవనం నిర్మించడం కూడా సాధ్యపడదని, ఇలా తక్కువ నిధులు కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చెప్పాలంటూ కేంద్రాన్ని ఈ లోక్ సభ సమావేశాల్లోనూ డిమాండ్ చేశారు. ఇలా పట్టువదలని విక్రమార్కుడిలా రామ్మోహన్ పోరాటం చేయడంతో తాజాగా కేంద్రం తల వంచింది.
ఎట్టకేలకు విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రకారం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్…రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేసినట్టు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపడతామన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలిపారు. 2013-14లో రూ.110 కోట్లతో మంజూరు చేసిన కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపులను తాజాగా రూ. 560.72 కోట్లకు పెంచినట్టు వివరించారు.