తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాలపై కన్నేసిన సంగతి తెలిసిందే. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు, అందులో తాను కీలక భూమిక పోషించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం అయ్యారు. అయితే, కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై తాజాగా బీజేపీ అగ్రనేత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినపుడు కేంద్రంలో ఉన్న విధానాలను మార్చాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కామెంట్ చేశారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కే కేశవరావు, నామానాగేశ్వర్‌రావు ఇతర ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ధాన్యం కొనుగోలుపై తెలంగణ ప్రతినిధి బృందం తమ వాదన వినిపించగా, కేంద్ర మంత్రి ఆయా నిబంధనలు వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పంజాబ్‌లో సేకరించిన విధంగా తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించరని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పుడున్న ధాన్యం సేకరణ విధానాన్ని మార్చాలని కోరారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన డిమాండ్ కేంద్ర మంత్రి గోయల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఇక్కడ (ఢిల్లీలో) అధికారంలోకి వస్తారుగా.. అప్పుడు మార్చండి’ అంటూ వెటకారంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన ప్రశాంత్‌రెడ్డి.. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బదులిచ్చారు. బీజేపీ కూడా ఇద్దరితో మొదలై ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై గోయల్ స్పందిస్తూ.. తెలంగాణ నుంచి బియ్యం మాత్రమే సేకరిస్తామని, ధాన్యం సేకరించబోమని స్పష్టం చేశారు. మొత్తంగా కేసీఆర్ ఢిల్లీ సర్కారు ఏర్పాటుపై కేంద్ర మంత్రి చేసిన కామెంట్లు చర్చకు తెరలేపాయి.