పార్టీ పదవుల నుంచి తొలగించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు ఝలక్ ఇవ్వటం కాదని…. తానే ఆయనకు అసలైన షాక్ ఇస్తానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు తనకు రేవంత్‌రెడ్డికి మధ్య మాత్రమేనని… కాంగ్రెస్‌కు సంబంధంలేదని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో కలిసి సాగుదామని రేవంత్‌రెడ్డి ఏనాడు తనకు చెప్పకపోగా.. అనుచరులతో తనపై టీఆర్ ఎస్ నేత అనే ముద్ర వేయిస్తున్నారని వాపోయారు. ముత్యాల ముగ్గులో కథానాయిక మాదిరి కాంగ్రెస్‌లో తన పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.
“వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తొలగించారు. నాకు రేవంత్ ఝలక్ ఇవ్వడం కాదు.. నేనే ఆయనకు ఝలక్ ఇస్తా. నాకు రేవంత్ మధ్య గొడవతో పార్టీకి నష్టం కలగదు. రేవంత్ పట్టుబట్టి నన్ను సస్పెండ్ చేయించినా పార్టీకి నష్టం లేదు.“ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల సీఎల్పీలో రేవంత్‌రెడ్డి తానూ కలిసినప్పుడు.. ఇద్దరూ కలిసిపోయారని అనుకునేలా ఫొటోలు బయటికి వచ్చాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ తనను బుజ్జగించాడని అందరూ అనుకున్నారని.. కానీ కలిసి పనిచేద్దామని కూడా ఆయన తనతో ఏనాడు అనలేదని తెలిపారు.
“ఇటీవల సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు..కేసీఆర్‌కు సీరియస్‌గా ఉంది, ఆస్పత్రిలో ఉన్నారని రేవంత్ చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేయాలనే ప్రయత్నం జరుగుతోందని నాతో అన్నారు. పోలీసు వ్యవస్థను గవర్నర్ తన కంట్రోల్లోకి తీసుకున్నారని.. మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.“ అని జగ్గారెడ్డి చెప్పారు.
సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నానన్నారు. కాంగ్రెస్‌లోనే తప్పొప్పులు మాట్లాడేకునే వీలుంటుందని, పదవులు కోత అనేది స్పోర్టివ్‌గా తీసుకుంటానన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. దేశానికి కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందన్నారు. అయితే తన పంచాయితీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, మెదక్ పర్యటనకు రేవంత్ తనను పిలవలేదని చెప్పారు.
రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలన్నారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడతానన్నారు. తనతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడట్లేదన్నారు. తనతో మాట్లాడేందుకు నేతలు భయపడుతున్నారని అన్నారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అన్నందుకు నొచ్చుకుని ఉంటారని.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.