కొన్ని నెలల కిందట జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. సాధారణ ఎన్నికలను మించి ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలు, వివాదాలతో అట్టుడికిపోయింది టాలీవుడ్. మునుపెన్నడూ లేని స్థాయిలో ఒకరి మీద బురదజల్లుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా రచ్చ ఆగలేదు. అధ్యక్షుడిగా ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆయన ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరూ కార్యవర్గం నుంచి వైదొలగడం లాంటి పరిణామాలతో ఎన్నికల తాలూకు ప్రకంపనలు కొనసాగాయి. ఆ తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది.
ఐతే ఇప్పుడు మళ్లీ ‘మా’ ఎన్నికల అంశంపై రచ్చకు తావిచ్చాడు మంచు మనోజ్. తిరుపతిలో తమ విద్యా నికేతన్ వార్షికోత్సవం, మోహన్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడుతూ అతను ‘మా’ ఎన్నికల వ్యవహారంపై వ్యాఖ్యానించాడు.
ఈ మధ్య ‘మా’ ఎన్నికలు జరిగాయని.. ఆ సందర్భంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారని.. చివరికి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఉంటే బాగుంటుందని తన అన్నయ్యకు అందరూ ఓటేసి గెలిపించారని.. ఎన్నికల సందర్భంగా ఏం జరిగినా ఇండస్ట్రీలో అందరూ ఒకరికి ఒకరు కావాల్సిన వాళ్లే కావడంతో అంతా సద్దుమణిగిందని.. కానీ ఒక వ్యక్తి మాత్రం తన అన్నని అదే పనిగా టార్గెట్ చేశాడని, మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు ఏదో ఒకటి అంటూనే ఉన్నాడని.. కానీ విష్ణు కానీ, తన తండ్రి కానీ ఆ మాటల్ని పట్టించుకోలేదని.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక కూడా తమను సపోర్ట్ చేసేవారిని వయసుతో సంబంధం బూతులు తిట్టారని మనోజ్ అన్నాడు.
వాళ్లు ఇదంతా ఎందుకు చేశారని ఆలోచిస్తుంటే.. తన తండ్రి ‘‘పాపం అతడికి జీవితంలో హైయర్ పర్పస్ లేదురా నాన్నా వదిలేయ్’’ అన్నట్లు మనోజ్ వెల్లడించాడు. అప్పుడు ఆలోచిస్తే.. తన తండ్రి చెప్పింది నిజమే అనిపించిందని, ఆ వ్యక్తి చుట్టూ గొప్ప గొప్ప వాళ్లున్నారని.. ఆ కుటుంబంలో అందరూ జనాల కోసం ఏదో ఒకటి చేయాలని హైయ్యర్ పర్పస్‌తో ఉన్నారని, కానీ ఆ వ్యక్తి మాత్రం ఏదీ లేకుండా ఉండిపోయాడని.. కాబట్టి జీవితంలో హైయర్ పర్పస్ లేకుంటే జీవితం చాలా బ్యాడ్‌గా ఉంటుందని గుర్తించాలని మనోజ్ వ్యాఖ్యానించాడు. మనోజ్ పేరెత్తకపోయినా అతను అంటున్నది ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబే అనే విషయం అందరికీ అర్థమైపోయింది.