ప్రపంచవ్యాప్తంగా పలు దేశఆలు థర్డ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఫోర్త్ వేవ్ రాబోతోందన్న ప్రచారం కలవరపెడుతోంది.
చైనా, హాంకాంగ్‌లో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ ఫోర్త్ వేవ్ మొదలైందని, అది మిగతా దేశాలనూ త్వరలో పలకరిస్తుందని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో భారత్ లో ఫోర్త్ వేవ్ పై వైద్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్ సాగుతున్నందున భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్లు వచ్చినా, వేవ్‌లు వచ్చినా పెద్దగా ప్రభావం ఉండదని వారు చల్లని కబురు చెప్పారు.
కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు 5వేలకు దిగువనే నమోదవుతున్న నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పనిసరి నిబంధనను తొలగించే మార్గాలపై కేంద్రం దృష్టిసారించాలని డాక్టర్ సంజయ్ రాయ్ సూచించారు. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు ధరించాలని సూచించారు. సార్స్- సీఓవీ-2 వైరస్ పై క్షేత్రస్థాయిలో పరిశీలన, జీనోమ్ సీక్వెన్సింగ్.. తదితర విధానాలను ఎప్పటికప్పుడు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో వచ్చే వేరియంట్లను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవచ్చని అన్నారు.
వ్యాక్సినేషన్ వల్ల రోగనిరోధకశక్తి పెరిగిందని, ప్రస్తుత అధ్యయనాలు, ఒమిక్రాన్ వ్యాప్తిని బట్టి దేశంలో కొవిడ్-19 వైరస్ అంతం అయినట్లుగా భావించొచ్చని డాక్టర్. చంద్రకాంత్ లహారియా అన్నారు. శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోయినా, రోగనిరోధకశక్తి మాత్రం ఎప్పటికీ మనల్ని సంరక్షిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోని వారు, సింగిల్ డోసు తీసుకున్న వారికే భవిష్యత్తులో కొత్త వేరియంట్లతో ముప్పు అధికమని అభిప్రాయపడ్డారు.
సీరో సర్వే ప్రకారం పాజిటివిటీ రేటు 80-90 శాతం ఉందని, దీనిని బట్టి దాదాపుగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసినట్లు భావించవచ్చని చెబుతున్నారు. కాగా, గత రెండు మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య రెండు వేల దిగువకు పరిమితమవడం కూడా ఆశాజనకంగా మారింది. గడిచిన 24 గంటల్లో 1541 కరోనా కేసులు నమోదు కాగా, అంతకుముందు రోజు 1,761 మందికి వైరస్ సోకినట్లు తేలింది.