రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని, ఏపీ రాజధాని ప్లానింగ్‌ను రాబోయే 6 నెలల్లో పూర్తి చేయాలని కీలక తీర్పునివ్వడంతో ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ముందస్తు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని కోర్టు ఆదేశించడంతో వైసీపీ నేతల గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. అంతేకాదు, ఆ పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించడంతో వైసీపీ నేతలు కక్కలేక మింగలేక ఉన్నారు.
అమరావతి రాజధాని అవసరాలకు తప్ప ఇతర వేరే పనులకు ఆ భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పడం కూడా జగన్ సర్కార్ కు మింగుడు పడడం లేదు. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని కూడా సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ తీర్పు రావడానికి కొద్ది నెలల ముందు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అమరావతిలో తాము ఏపీ శాఖకు సంబంధించిన కార్యాలయం నిర్మించుకుంటామని కోరింది. కానీ, దానిపై జగన్ సర్కార్ స్పందించలేదు.
ఇక, ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే తాజగా అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్ దీప్ సింగ్ పూరితో వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హర్ దీప్ సింగ్ పూరిని ఆయన కార్యాలయంలో కలిసిన రఘురామ ఏపీకి సంబంధించిన పలు వినతులను అందజేశారు.
ఏపీ రాజధాని అమరావతిలో బీపీసీఎల్, హెచ్ఓసీఎల్, గెయిల్, సీపీడబ్ల్యూడీ భవనాల నిర్మాణాన్ని తక్షణమే మొదలుపెట్టాలని కేంద్రం మంత్రి హరిదీప్ ను రఘురామ కోరారు. ఈ ప్రకారం ఆయన కేంద్ర మంత్రికి ఓ వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు, తన వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని రఘురామరాజు తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. రఘురామరాజుతో భేటీ అయిన విషయాన్ని కేంద్ర మంత్రి హరిదీప్ కూ కూడా ట్వీట్ చేయడం విశేషం.