- రాజకీయ చైతన్యానికి.. సాహితీ వికాసానికి పుట్టినిల్లు
- అన్న ఎన్టీఆర్, పీపుల్స్‌వార్ కొండపల్లి ఇక్కడివారే
- మంత్రి, అనుచరుల నేతృత్వంలో
- జూదగృహాల జోరు
గుడివాడ.. కృష్ణా జిల్లా రాజకీయాలకు కీలక కేంద్రం.. ఒకనాడు విదర్భపురిగా విలసిల్లింది. అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కింది.. దివంగత ఎన్టీఆర్, కొండపల్లి సీతారామయ్యఎందరో ప్రముఖులను తన ముద్దుబిడ్డలుగా దేశానికి అందించింది.
ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయం అంతా గుడివాడ చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు.. ఎందరెందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి దేశ విదేశాల్లో కీలకమైన కొలువులు చేపట్టి తమ ప్రాంతానికి వన్నెలద్దారు.
స్వాత్రంత్య సమరంలోనూ గుడివాడవాసుల చైతన్యం నిత్యస్మరణీయం. మహాత్మాగాంధీ స్ఫూర్తితో గుడివాడకు చెందిన గూడూరి రామచంద్రుడు హరిజనాశ్రమం నిర్మించారు. ఈయన గురించి 1921లో ‘యంగ్ ఇండియా’ పత్రికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. గుడివాడవాసుల చైతన్యానికి ముచ్చటపడిన మహాత్ముడు.. 1921, 1929, 1933 సంవత్సరాల్లో మూడు సార్లు గుడివాడ వచ్చారు. అంతటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతం నేడు జూదానికి మారు పేరుగా మారిపోయింది. గోవాను తలపించే కేసినోలు.. పచ్చని పంటపొలాల గట్లపై జూదగృహాలు.. పేకాట శిబిరాలు వెలిశాయి.
ఎందరో మహానుభావులు..
ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు జన్మించింది ఒకప్పటి గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులోనే. సొంత ఊరిపై మమకారంతో 1983లో ఆయన తన రాజకీయ అరంగేట్రానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్నే కార్యశాలగా ఎంచుకున్నారు.
గుడివాడ వాసులూ అంతే మమకారంతో ఆయన్ను గెలిపించారు. 1985లోనూ ఇక్కడి నుంచే గెలుపొందారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మార్చుకుంది. అందమైన రహదారులతోపాటు క్రీడాప్రియుల కోసం ఎన్టీఆర్ స్టేడియం నిర్మితమైంది. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరాయి.
ఎన్టీఆర్‌తోపాటు గుడివాడ మరెందరో ప్రముఖులకు పుట్టినిల్లు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావుది నందివాడ మండలం వెంకటరాఘవాపురం. సినీ సంగీతానికి తన మధురగళంతో వన్నెలద్దిన గానగంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావుది చౌటపల్లి గ్రామం.
సమసమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన మావోయిస్టు ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్యది ఇదే నియోజకవర్గంలోని లింగవరమే. కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరిది గుడ్లవల్లేరు మండలం అంగలూరు. సినీఫోటోగ్రపీ దిగ్గజం వీఎస్ఆర్ స్వామిది గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు.
గుడ్లవల్లేరు మండలం కౌతవరం నవరసనటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ సొంతూరు. సినీపాటలకు సాహిత్య శోభను అద్దిన జాలాది, దేశ విద్యుత రంగానికి వెన్నెముకలా నిలిచిన నార్ల తాతారావు, దిగ్గజ పాత్రికేయుడు, కవి నార్ల వెంకటేశ్వరరావు ఈ నియోజకవర్గవాసులే.. కేసీపీ షుగర్స్ సంస్థ వ్యవస్థాపకుల్లో గుడివాడకు చెందిన అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య ముఖ్యులు.
బౌద్ధ వాజ్మయ్య బ్రహ్మగా పేరొందిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య, ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, కొల్లి ప్రత్యగాత్మ(కె.ప్రత్యగాత్మ), నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు, రిలయన్స్ గ్యాస్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న పండా మధుసూధన్ ప్రసాద్(పీఎంపీ), ప్రముఖ సాహితీవేత్త త్రిపురనేని హనుమాన్ చౌదరి గుడివాడ వాస్తవ్యులే. దేశంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన మే సంస్థల అధినేత పీపీ రెడ్డి గుడ్లవల్లేరు మండలం డోకిపర్రువాసి.
దక్షిణాన తొలి హోమియో కాలేజీ ఇక్కడే..
దక్షిణ భారతదేశంలోనే మొదటి హోమియో కాలేజీ.. గురురాజా హోమియో కళాశాల 1945లో నెలకొల్పారు. మాజీ రాష్ట్రపతి వీవీ గిరికి వ్యక్తిగత వైద్యుడిగా పేరొందిన డాక్టరు గురురాజు ముదునూరి దీని ఏర్పాటులో ముఖ్యులు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోమియో రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. వ్యవసాయ పరికరాల తయారీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గుడివాడ అగ్రగామి.
ఇదంతా ఒకప్పటి చరిత్ర. నేడు గుడివాడ పేరు వినగానే గుర్తుకు వచ్చేది జూదగృహాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా కేసినో సంస్కృతిని తొలిసారి దిగుమతి చేసుకున్న పట్టణంగా నిలిచిపోయింది. ఎందరో మధ్యతరగతి జీవుల జీవితాలను ఛిన్నాభిన్నం చేయడంతోపాటు ధనికులనూ రోడ్డుపాలు చేయగల జూద గృహాలకు నిలయంగా మారింది.
పచ్చని పొలాలు, చెరువు గట్లతో పాటు శుభకార్యాలకు నెలవులైన కల్యాణమండలపాలను సైతం జూదగృహాలుగా మార్చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడమే ఆయనకు ముఖ్యం. జూద గృహాలన్నీ ఆయన అనుచరుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కేసినో సంస్కృతి కూడా ఆయన చలవతోనే గుడివాడలోకి వచ్చిందన్న విమర్శలు గుప్పుముంటున్నాయి.
మంత్రి కన్వెన్షన్ హాలే వేదిక
‘గోవాలోని కేసినోలకు ఏమాత్రం తగ్గొద్దు! శ్రీలంక కేసినోలను మైమరిపించాలి! నొప్పి తెలియకుండా డబ్బులు లాగేయాలి!’… అని అనుకున్నారు! అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు. గోవా కేసినోలను అచ్చు గుద్దినట్లు గుడివాడలో దించేశారు. అక్కడి కేసినోలలో ఉన్నట్లుగానే కాయిన్లు! ఎంట్రీ చార్జీ రూ.10 వేలు! అన్‌లిమిటెడ్‌గా మందు, విందు! అదనంగా… అమ్మాయిలతో హుషారెత్తించే నృత్యాలు!
కేసినోలలో టేబుళ్ల వద్ద గేమ్ నడిపించింది అమ్మాయిలే. ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్‌కు చెందిన సుశిక్షితులు ప్రొఫెషనల్‌గా ఆట ఆడిస్తారు. వీరినే ‘కేసినో డీలర్స్’ అంటారు. ‘గుడివాడ గ్యాంగ్’ సిసలైన కేసినోలలో పనిచేసే అమ్మాయిలనే ఇక్కడికీ రప్పించారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి అనుచరులు కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి ఈ కేసినో ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే… ఈ జూదక్రీడకు కర్త, కర్మ ఆ మంత్రేనని చెప్పుకొంటున్నారు.
మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ హాలులోనే దీనిని నిర్వహించారు. భోగి రోజున మొదలైన కేసినో కనుమ పండుగ తర్వాతి రోజుదాకా సాగింది. స్వాగత తోరణం నుంచి లోపలి అలంకారం వరకు అంతటా ‘అధికార ముద్ర’ కనిపించింది. వైసీపీ పతాకంలోని వర్ణాలైన ఆకుపచ్చ, నీలం, తెలుపు వస్త్రాలతో కేసినోను అలంకరించారు. కిందంతా మెత్తటి ఎర్ర తివాచీ పరిచారు.
వివిధ రకాల క్రీడల కోసం వేర్వేరు టేబుళ్లు ఏర్పాటు చేశారు. గుండాట, అందర్ బాహర్తోపాటు… కేసినోలలో కనిపించే ‘రౌలెట్’ గేమ్ కూడా పెట్టారు. దాదాపు అన్ని టేబుళ్ల వద్ద ప్రొఫెసనల్ కేసినో డీలర్లు (అమ్మాయిలు) ఆట నడిపించారు. గోవాలో టాప్ కేసినోలో ఎంట్రీ ఫీజు రూ.6వేలు మించదు.
గుడివాడ కేసినోలో మాత్రం రూ.10వేలుగా నిర్ణయించారు. డబ్బులు కట్టిన వారినే లోపలికి అనుమతించారు. గతంలో గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరాలకు హాజరైన ‘జూద ప్రియుల’కు ముందుగానే కేసినోకు సంబంధించిన సమాచారం పంపించారు. ‘మరేం ఫర్వాలేదు. మూడు రోజులు ఏమాత్రం భయం లేకుండా ఆడుకోవచ్చు. రండి… తరలి రండి’ అని పిలుపునిచ్చారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాత, కొత్త ‘ఖాతాదారులు’ గుడివాడలో వాలిపోయారు. కేవలం ‘ఎంట్రీ ఫీజు’ రూపంలోనే నిర్వాహకులకు 3 రోజుల్లో సుమారు రూ.2 కోట్లు వరకు వచ్చిందని సమాచారం. ఇక… సోమవారం తెల్లవారుజాము వరకు రాత్రింబవళ్లు నిర్విరామంగా ఆటలు సాగాయి. ఇందులో దాదాపు రూ.200 కోట్లు కుమ్మేసినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా నాని బుకాయించడం మానలేదు.
‘నా రెండున్నర ఎకరాల కల్యాణ మండపంలో కేసినో, జూదం నిర్వహించినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా! పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా’ అని ఆయన సవాల్ చేయడం చూసి ప్రజలు విస్తుపోయారు. ఇంత పచ్చి అబద్ధం ఎలా ఆడతారని ముక్కపై వేలేసుకున్నారు.
టీడీపీ నిజ నిర్ధారణ బందంపై రాళ్లదాడి
కేసినో వ్యవహారంపై నిజ నిర్ధారణకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతల పర్యటనను భగ్నం చేయడానికి అధికార పార్టీ నేతలు బరితెగించారు. పోలీసుల తీరు కూడా కలిసిరావడంతో చెలరేగిపోయారు. గుడివాడను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులు చేస్తూ.. రాళ్ల వర్షం కురిపించారు.
దాదాపు రెండు వేలమంది ఒకేసారి రోడ్లపైకి రావడంతో కొన్నిగంటలపాటు అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి! నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి ఏకపక్షంగా, యథేచ్ఛగా కొన్నిగంటలపాటు సాగిన ఈ దాడిలో టీడీపీ నేత బొండా ఉమా కారు ధ్వంసం కాగా, ఓ టీడీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులకు చివరకు టీడీపీ నేతలనే అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించడం విశేషం.
కేసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్!!
గుడివాడ కే కన్వెన్షన్‌లో పక్కాగా కేసినోను తలపించేలా ఏర్పాట్లు.. జూద క్రీడలు నిర్వహించారంటే.. దాని వెనుక మంచి అనుభవం ఉన్న వ్యక్తే ఉండాలి. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీయగా చీకోటి ప్రవీణ్ పేరు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మారియట్ హోటల్లో 2017లో జూదక్రీడలు నిర్వహించి పట్టుబడిన ప్రవీణ్.. మళ్లీ ఇన్నేళ్లకు గుడివాడలో ప్రత్యక్షం కావడం విశేషం. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అతడికి ఉన్న మంచి పరిచయాల కారణంగా గుడివాడ కేసినో బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది.