చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు వేవ్ ల సునామీలాగా విరుచుకుపడిన కరోనా ధాటికి పలు దేశాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ దెబ్బ నుంచి కోలుకొని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో చైనాలో ఫోర్త్ వేవ్ మొదలైంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్న ‘బి.ఎ.2’ ప్రభావంతో చైనాలోని పలు నగరాలు లాక్డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి.
కరోనా విజృంభించిన సమయంనాటి పరిస్థితులు ఇపుడు చైనాలోని పలు నగరాల్లో దర్శనమిస్తున్నాయి. పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది, నిర్మానుష్యంగా మారిన రోడ్లు వంటి దృశ్యాలు ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్నాయి. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ తరహాలోనే ఈ వేరియంట్ తో మరణాలు సంభవించే అవకాశం చాలా తక్కువ. కానీ, డెల్టా కన్నా చాలా రెట్లు వేగంగా ఇది వ్యాప్తి చెందడంతో ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాలు అతలాకుతలమవుతున్నాయి.
సోమవారం ఒక్కరోజే 2,300 కేసులు రికార్డ్ అయ్యాయి. అంతకుముందు రోజు 3400 కేసులు నమోదయ్యాయి. గడచిన రెండేళ్లలో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. చైనాలో టెక్ హబ్‌గా పిలిచే షెన్జెన్ సిటీలో ఒకే రోజు 66 మందికి పాజిటివ్‌గా తేలడంతో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ప్రజలెవరూ ఇళ్లు విడిచి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. షెన్జెన్ పరిధిలో ఫ్యాక్టరీలు, స్మాల్ స్కే్ల్ క్లస్టర్లు ఎక్కువగా ఉండటంతో కమ్యూనిటీ స్ర్పెడ్ వేగంగా జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. చైనాలో 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.