సీఎం జగన్ రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోతున్నారా? జగన్ కు విపక్ష నేతల కంటే సొంతింట్లోనే ప్రతిపక్షం ఒత్తిడి ఎక్కువవుతోందా? అధికారం కోసం జగన్ ఇంట్లో వేరు వేరు రాజకీయ కుంపట్లు రగులుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది. అన్న జగన్ తో విభేదించిన షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకోవడం రేపిన సంచలనం సద్దుమణగక ముందే…తాజాగా జగన్ బావ, షర్మిల భర్త బ్రదర్ అనిల్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
జగన్ పై బ్రదర్ అనిల్ కొద్ది రోజులుగా అసమ్మతి రాగం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో వరుసగా బ్రదర్ అనిల్ నిర్వహిస్తున్న సమావేశాలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల విజయవాడలో క్రిస్టియన్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన అనిల్…కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జరిగింది. బ్రదర్ అనిల్ తమతో ఈ మాట చెప్పారని బీసీ సంఘాల నాయకులు మీడియాతో వెల్లడించగా…అనిల్ ఆ కామెంట్లను కొట్టిపారేశారు. అయితే, తాజాగా విశాఖలో బీసీ, క్రిస్టియన్, ఎస్సీ, మైనారిటీ సంఘాల నాయకులతో అనిల్ మరో భేటీ నిర్వహించడం ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా ఉంది.
వైసీపీ గెలుపు కోసం పని చేసిన బీసీ వర్గాలు, క్రిస్టియన్లు, మైనారిటీలు తమకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఉన్నారని, వారి బాధలు వినేందుకు తాను సమావేశాలు పెడుతున్నానని బ్రదర్ అనిల్ తాజాగా వెల్లడించారు. వైసీపీ గెలుపుకోసం పనిచేసిన వర్గాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని, వాళ్ల గోడు వినేందుకే ఉత్తరాంధ్ర వచ్చానని తెలిపారు. అంతేకాదు, దీనిపైన సీఎం జగన్ కు లేఖ రాస్తానని కూడా బ్రదర్ అనిల్ చెప్పారు. పార్టీ పెట్టాలని వివిధ సంఘాల వారు అడుగుతున్నారని చెప్పారు. అయితే, అది సామాన్యమైన విషయం కాదని, చాలా క్లిష్టమైన పని అని, దీనిపై సుదీర్ఘంగా ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తోందని, దీన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. జగన్ ను కలిసి రెండున్నరేళ్లయిందని, ఆయన అపాయింట్ మెంట్ కోరడం లేదని అన్నారు. అయితే, బ్రదర్ అనిల్‌కు పార్టీ పెట్టే ఆలోచన ఉందని.. అన్ని సమావేశాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని.. అప్పటి వరకూ పెదవి విప్పరని టాక్ వస్తోంది. బామ్మర్ది జగన్ సీఎం సీటుకే ఎసరు పెట్టిన బ్రదర్ అనిల్ అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.