ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఐదో రోజు సభలో జంగారెడ్డిగూడెం నాటు సారా ఘటనపై చర్చ పెను దుమారం రేపింది. నాటు సారా వల్ల జనం పిట్టల్లా రాలిపోతున్నారని, దీనిపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే, చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేయడంతో సభను వాయిదా వేశారు.
సభ ప్రారంభమైన తర్వాత కూడా చర్చకోసం టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వీరాంజనేయస్వామిలను బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు.
ప్రజా సమస్యపై చర్చించమని కోరితే సస్పెండ్ చేయడం ఎంతవరకూ సమంజమసమని టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టూ నినాదాలు చేశారు. సస్పెండ్ చేసినా సభ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లలేదు. దీంతో, వారిని బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. ఈ నినాదాల మధ్యనే జంగారెడ్డిగూడెం ఘటనపై మంత్రి ఆళ్ల నాని స్టేట్మెంట్ ఇచ్చారు. సస్పెండ్ చేసే క్రమంలో టీడీపీ సభ్యులపై తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోవడం చర్చనీయాంశమైంది.