ఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్కు కేవలం ఓటమి మాత్రమే దక్కలేదు. అంతకుమించి.. అన్నట్టుగా ఘోర పరాజయంతోపాటు.. ప్రజల నుంచి ఛీత్కారాలు కూడా ఎదురయ్యాయి. ఎంత ఘోరంగా అంటే.. మొత్తం 399 మంది అభ్యర్థులను పోటీకి నిలబెడితే.. (మరో నాలుగు చోట్ల నిలబెడదామన్నా అభ్యర్థులు లేరు) 387 మందికి అసలు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.
యూపీలో కేవలం రెండంటే రెండే స్థానాలకే పరిమితమై పేలవ ప్రదర్శన చేసిన కాంగ్రెస్.. అదే ఎన్నికల్లో మరోచెత్త రికార్డు నమోదు చేసింది. రికార్డు స్థాయిలో 97 శాతం మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత స్థానంలో బీఎస్పీలో 72 శాతం మంది డిపాజిట్లు కోల్పోయి.. అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు.
స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు దాదాపు అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ దూసుకుపోతుంటే.. ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. దాదాపు 70 ఏళ్లు దేశంలో చక్రం తిప్పిన హస్తం పార్టీ.. ఇప్పుడు ఘోర పరాభవాన్ని చవిచూస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే పునరావృతం అయింది. ముఖ్యంగా.. ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థులు రికార్డు స్థాయిలో డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దపడుతోంది.
399 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలో దించగా.. 387 (97శాతం) మందికి డిపాజిట్ కూడా దక్కలేదు. రెండు స్థానాల్లో అతి స్వల్ప అధిక్యంతో గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్కు 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. యూపీలో హస్తం పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని ఎన్నడూ చూడలేదు.
ఏ స్థానంలోనైనా డిపాజిట్ కాపాడుకోవాలంటే అభ్యర్థి మొత్తం ఓట్లలో 16.66 శాతం పొందాలి. అంటే.. ఈ మాత్రం ఓట్లు కూడా జాతీయ పార్టీగా కాంగ్రెస్ దక్కించుకోలేక పోయింది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. సోనియా కుమార్తె ప్రియాంక వాద్రా కాలికి చెప్పులు అరిగిపోయేలా.. పర్యటించారు. నియోజకవర్గాలను చుట్టేశారు. అయినా.. ఓటరు కాంగ్రెస్ను పట్టించుకోలేదు.
ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కేవలం ఒక్కటంటే ఒకే స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీకి చెందిన 290 (72 శాతం)మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 347 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలోకి ఉంచగా.. వారిలో ఆరుగురు అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఎస్పీ మిత్రపక్షమైన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అప్నాదళ్ (కామెరవాదీ) మొత్తం 25 మంది అభ్యర్థులను నిలబెట్టగా.. అందులో 8 మంది డిపాజిట్లు కోల్పోయారు.