పెద్ద ఎత్తున చేరికలు లేవు.. ఉన్న కీలన నేతలూ జారుకుంటున్నారు.. ప్రత్యర్థి పార్టీల నుంచి గుర్తింపు లేదు.. ప్రజల నుంచి స్పందన లేదు.. మీడియాలో హైప్ లేదు.. అయినా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తగ్గేదేలే అంటున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గతంలో విరామం ప్రకటించిన ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆమె తాజాగా తిరిగి ప్రారంభించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఊహించిన మైలేజీ తన పార్టీకి దక్కకపోవడంతో షర్మిల మళ్లీ పాదయాత్ర చేయరనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆమె మాత్రం తిరిగి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మధ్యలో రైతు భరోసా యాత్ర, నిరుద్యోగ దీక్షలతో హడావుడి చేసిన ఆమె ఇప్పుడు పాదయాత్రలో మళ్లీ సాగనున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా గతేడాది పార్టీ స్థాపించిన షర్మిల తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డ బాటలో సాగాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం గతేడాది అక్టోబర్ 20న చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 21 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నవంబర్ 9న వాయిదా వేశారు. ఇప్పుడు తిరిగి ఎక్కడైతే పాదయాత్రకు విరామం ప్రకటించారో మళ్లీ అక్కడే నల్గొండ జిల్లా కొండపాకోనిగూడెంలో తిరిగి పునఃప్రారంభించారు. తెలంగాణలోని 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా దాదాపుగా 14 నెలల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు.
పాదయాత్రను తిరిగి ప్రారంభించిన షర్మిల సీఎం కేసీఆర్పై విమర్శల వర్షం కొనసాగించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ తెలిస్తే కేసీఆర్ ఏడేళ్లు లెక్కలేసి 80 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామనడం దారుణమని ఆమె మండిపడ్డారు. అప్పులు రాష్ట్రంగా తెలంగాణను మారుస్తున్న కేసీఆర్.. ఒక్కో కుటుంబంపై రూ.4 లక్షల చొప్పున అప్పు భారం మోపుతున్నారని ఆమె ఆరోపించారు. తన తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.