జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పార్టీ ఫండ్ కోసం బెదిరింపులు…ఇలా సామాన్యులు మొదలు బడా వ్యాపారవేత్తల వరకు అందరూ వైసీపీ నేతలు చెప్పినట్లు వినాల్సిందే. ఇప్పటిదాకా వీటికే పరిమితమైన అధికార పార్టీ నేతలు తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. కొత్త సినిమా రిలీజైన వెంటనే తమకు ప్రతి షోకు100 టికెట్లు కావాలంటూ థియేటర్ల యజమానులకు హుకుం జారీ చేస్తున్న వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఏ రేంజ్ లో రచ్చ జరిగిందో మనకు తెలిసిందే. అయితే, పది సార్లు…పది మంది సినీ ప్రముఖులు..పదే పదే జగన్ ను ప్రాధేయపడడంతో….జాలిదలిచిన జగన్…తాజాగా టికెట్ రేట్లపై కొత్త జీవో తీసుకువచ్చారు. నయానో…భయానో…టికెట్ రేట్లు పెరిగాయిలే అనుకుంటున్న థియేటర్ల యజమానులకు వైసీపీ నేతలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. కొత్త సినిమా విడుదలైన తర్వాత ప్రతి షోకు తమకు 100 టికెట్లు కావాలంటూ థియేటర్ యాజమాన్యాలను విజయవాడ మేయర్ ఏకంగా లేఖ రాయడం సంచలనం రేపుతోంది.
విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని సినిమా హాళ్ల యాజమాన్యాలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి రాసిన లేఖ పెను దుమారం రేపుతోంది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, దీంతో, సినిమా టికెట్లు కావాలంటూ పార్టీ ప్రతినిధులు, వార్డు కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని మేయర్ భాగ్యలక్ష్మి ఆ లేఖలో పేర్కొన్నారు. అంచేత, కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి తప్పనిసరిగా ప్రతి షోకు 100 టికెట్లు తమకు పంపాలని ఆ లేఖలో స్పష్టంగా రాశారు.
అంతేకాదండోయ్, ఆ టికెట్లు తనకు ఫ్రీగా వద్దని, నిర్దేశించిన టికెట్ రుసుం నగదు రూపంలో చెల్లిస్తామని కూడా మేయర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక నుంచి విడుదలయ్యే కొత్త చిత్రాలకు ఈ ప్రకారంగా టికెట్ల మామూలు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తూ స్వదస్తూరితో మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. చివరకు టికెట్లు కావాలని కూడా వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శలు వస్తున్నాయి.