వైసీపీ హయాంలో హిందూ ఆలయాలు, ఆస్తులు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని టీడీపీ, బీజేపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నవారిపై జగన్ కఠిన వైఖరి అవలంబించడం లేదని, కఠిన శిక్షలు విధించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువైందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామతీర్థం ఘటన వ్యవహారం పెనుదుమారం రేపడంతో ఆలయాలపై దాడుల వ్యవహారం, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కొందరి సోషల్ మీడియా ఖాతాలపై సీఐడీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. ప్రవీణ్ విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో క్రిస్టియన్ విలేజెస్ ఏర్పాటు చేసేందుకు ప్రవీణ్ ప్రయత్నిస్తున్నాడని, ఈ క్రమంలోనే దాదాపు 699 క్రిస్టియన్ గ్రామాలను ఏర్పాటు చేశాడన్న వార్త సంచలనం రేపుతోంది.
గత ఏడాదిగా ఇతర మతాలను కించపరిచేలా ప్రవీణ్ యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని విచారణలో తేలింది. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ప్రవీణ్ ను అరెస్ట్ చేసి విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వీడియోలు పెట్టడమే కాకుండా… తానే కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్ని విగ్రహాలను కాలితో తన్నానని ప్రవీణ్ తన వీడియోలలో స్వయంగా వెల్లడించడం సంచలనం రేపింది. క్రిస్టియన్ పాస్టర్ అయిన ప్రవీణ్ విదేశాల నుంచి నిధులు రాబట్టి, ఆంధ్రపదేశ్ లో క్రిస్టియన్ విలేజెస్ ఏర్పాటు చేస్తున్నాడు. అన్నదమ్ములవలె అన్ని మతాలవారు కలిసిమెలసి నివసిస్తున్న పచ్చటి గ్రామాలను క్రిస్టియన్ విలేజెస్గా మార్చుతూ చిచ్చుపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లలో చెట్టు, పుట్ట, రాళ్లను దేవుళ్లుగా కొలుస్తారని, వాటిని లేకుండా చేసి గ్రామం మొత్తాన్ని క్రిస్టియానిటీ గ్రామంగా మార్చడమే క్రిస్టియన్ విలేజ్. ఈ క్రమంలోనే తాను స్వయంగా కొన్ని విగ్రహాలను కాలితో తన్నానని, అందుకు సంతోషంగా ఉందని ప్రవీణ్ గర్వంగా చెబుతున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోతోపాటు, నిధుల విషయం గురించి, క్రిస్టియన్ విలేజెస్ గురించి విదేశీయుడితో చర్చిస్తున్న వీడియో కాల్ కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ అనే సంస్థ బట్టబయలు చేసింది. దీంతో, ప్రవీణ్ పై కేసు నమోదైంది.
ప్రవీణ్ వంటివారి వల్లే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రవీన్ కు బెయిల్ ఇవ్వకూడదన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ వంటి వారి విషయంలో పాలకులు ఇకనైనా కళ్ళు తెరవాలని, అటువంటి వారికి కఠిన శిక్షలు విధించాలని పలు హిందుత్వ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో, ఒక వేళ ప్రవీణ్ విడుదలైతే ప్రభుత్వానికి తీవ్రమైన డ్యామేజీ జరిగే అవకాశముందని జగన్ సర్కార్ కూడా యోచిస్తోందట. అదీకాకుండా, ప్రవీణ్ వంటి వారికి బెయిల్ వస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే చాన్స్ ఎక్కువగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ కు బెయిల్ వస్తే… హిందూ ఆలయాలు, దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసినా ఏమీ కాదని, సులువుగా బెయిల్ వస్తుందన్న భావనతో మరింతమంది దుండగులు రెచ్చిపోయే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ కు బెయిల్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.